
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది.
సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఫైబర్ గ్రిడ్, అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. చివరి రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యుడు రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ‘అన్నా క్యాంటీన్ల’ అవకతకలను సభలో ప్రస్తవించారు. అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలిపారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు.
అనంతరం జోగి రమేష్ ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందన్నారు. రూ.149లకే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని ప్రచారం చేశారని, సెటాప్ బాక్స్‌లకు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు. ఫైబర్ గ్రిడ్లో అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కిందని, ట్రాయ్ రూల్స్ విరుద్ధంగా వ్యవహరించిందని ఆర్కే తెలిపారు. ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందని, జగన్ పాదయాత్ర ప్రజల్లోకి వెళ్లకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. బహిరంగ సభలు ప్రజలు చూడకుండా కేబుల్ ప్రసారాలు నిలిపేసిందని ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా కమ్యునికేషన్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చంద్రబాబు భావించారని మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేబుల్ డ్యామేజ్ అయితే నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టమని బాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఏ స్కీమ్ చూసినా వేల కోట్ల అవినీతే కనబడుతుందని, ఫైబర్ గ్రిడ్‌పై విచారణ జరిపిస్తామన్నారు.