అడగటం హక్కు చెప్పటం బాధ్యత

- దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - Sakshi


రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్యాప్తు సంస్థకు ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా... బుకాయింపులకు తక్కువలేదు. మహానాడులో ప్రకటించే లక్షల కొలది రూపాయల విరాళాల లెక్కలేవీ ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించే గణాంకాల్లో ప్రతిబింబించవు. రాజకీయపక్షాల నడతలో, వాటి జమా ఖర్చుల్లో, ఇబ్బడిముబ్బడిగా పారే విరాళాల్లో, అవిచ్చే దాతల వనరుల గుట్టుమట్లలో పారదర్శకత లేనంతవరకు... ఎక్కడో విదేశీ బ్యాంకుల్లో మగ్గిన నల్లధనాన్ని నట్టింటికి రప్పిస్తామనడం పచ్చి బూటకం.

 

 ‘ఉల్లి మంచిది కాదు, తినకూడదని చెప్పింది ఊరందరికోసమే పిచ్చి మొహ మా! మన కోసం కాదు’ అన్నాట్ట, ఆయన మాటలు విని ఉల్లి లేకుండా కూర వండిన భార్యతో వెనకట ఓ పెద్దమనిషి. నీతులు ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఉంటాయేమో కొందరి విషయంలో.. కానీ, చట్టాలు అందరి కోసం ఉంటాయి, ఇది తెలియనట్టు నటిస్తూ ఈ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీ లు తమకు కొన్ని చట్టాలు వర్తించవని చెబుతూవస్తున్నాయి. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేయాలని కోరుకునే రాజకీయ పార్టీలు, తాము మాత్రం సమాచారహక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రామని రెండేళ్లుగా భీష్మించుకొని కూర్చున్నాయి. ‘మీరు ఈ చట్టపరిధిలోకొస్తారు’ అని కేంద్ర సమాచార కమి షన్ (సీఐసీ) రెండేళ్ల కింద ఇచ్చిన ఉత్తర్వును బేఖాతరంటూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా మొన్న మంగళవారం ఈ పార్టీల న్నింటికీ తాజాగా తాఖీ దులిచ్చింది.

 

 మీమీ పార్టీల రాబడులు, వ్యయాలు, విరాళాలు, దాతలు...ఇలా మీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం లో మీకున్న అభ్యంతరాలేంటి? ఎందుకు మీరు ఆర్టీఐ పరిధిలోకి రారో ఆరు వారాల్లో వివరించండని ఆరు ప్రధాన పార్టీలను నిర్దేశించింది. ఇదే విషయమై మీ వైఖరేంటో తెల్పండని కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ ఎన్నికల కమిషన్ని కూడా సుప్రీం ఆదేశించింది. ఎవరేం చెబుతారో వేచి చూడాలి. ఏం చెప్పినా, చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలన్నీ ప్రజా వ్యవస్థ (పబ్లిక్ అథారిటీ)లే ప్రజాస్వామ్య స్పూర్తిపరంగా చూసినా... రాజకీయ పార్టీల వ్యవ హారాలన్నీ ప్రజా జీవితంతో ముడివడి ఉన్నవే కనుక పారదర్శకంగా, ప్రజ లకు జవాబుదారుగా అవి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రా ల్లో చిచ్చురగిల్చిన ‘ఓటుకు కోటు’్ల వంటి దురాగతాలకు పార్టీల్లో, వాటి ఆర్థిక వనరుల నిర్వహణల్లో పారదర్శకత లోపించడం కూడా ఓ ప్రధాన కారణమే!

 

 చెప్పించుకునే స్థితి ఎందుకు?

 ఒక వివాదం తమ ముందు విచారణకొచ్చినపుడు, రాజకీయ పార్టీలన్నీ ప్రజా వ్యవస్థ నిర్వచన పరిధిలోకే వస్తాయని 2013 జూన్‌లోనే సీఐసీ తీర్పిచ్చింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు- కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలకు స్పష్టం చేసింది. అన్ని పార్టీలూ పౌర వ్యవస్థలే కనుక ఆర్టీఐ చట్ట నిబంధనల ప్రకారం పౌర సమాచార అధి కారి (పీఐవో)ని నియమించాలని ఇతర నిబంధనలన్నీ పాటించాలని 2015 మార్చిలోనూ తన తీర్పును సీఐసీ పునరుద్ఘాటించింది. కానీ, పార్టీలేవీ లెక్క చేయలేదు. కాంగ్రెస్, బీజేపీలు తమకీ చట్టం వర్తించదని కరాఖండిగా పేర్కొ న్నాయి.

 

 సీపీఐ మాత్రం ప్రజలకు సమాచారం ఇవ్వడానికి పెద్దగా అభ్యం తరం లేదని, అయితే విరాళాలిచ్చిన దాతల పేర్లు వెల్లడించాలనడం ఇబ్బంది కరమని పేర్కొంది. రాజకీయ పార్టీలు ప్రజా కార్యాలయాలే కావని, చట్టపు నిర్వచనం పరిధిలోకి రావంటూ పార్టీలేవీ సీఐసీ ఆదేశాల్ని పాటించలేదు. ఇక్కడో విశేషముంది. తమ అడ్డగోలు వ్యవహారాలకు వ్యతిరేకంగా న్యాయస్థా నాలుగానీ, రాజ్యాంగ-చట్టబద్దమైన సంస్థలుగానీ తీర్పులిచ్చినపుడు తర తమ భేదాలు లేకుండా రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడం ఈ దేశం లో తరచూ జరుగుతోంది. అందరూ కూడబలుక్కున్నట్టు సదరు చట్టాల్నో, రాజ్యాంగాన్నో మార్చుకున్న సందర్భాలూ ఉన్నాయి.

 

 ఎన్నికల సంస్కరణలు మింగుడుపడనప్పుడు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని అంశాల్ని సుప్రీం న్యాయస్థానం చెల్లవన్నపుడు ఇదే చేశారు. ఇలాగే ఓ మారు సుప్రీం తీర్పు నచ్చనపుడు, అందుకు భిన్నంగా పార్లమెంటులో కొత్తచట్టమే తీసుకొచ్చారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు, స్ఫూర్తికి లోబడి లేదని సర్వోన్నత న్యాయ స్థానం సదరు చట్టమే చెల్లదు పొమ్మంది. ఒకవైపు సుప్రీం ఏమంటుందోనన్న బెంగ, మరో వైపు ఈ అవసరం కోసం సమాచార హక్కు చట్ట సవరణకు ప్రతిపాదిస్తే ప్రజాక్షేత్రం నుంచి ఏం వ్యతిరేకత వస్తుందోనన్న భయం వల్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్ట సవరణకు సాహసించడం లేదు. నోట్ ఫైల్స్ విషయంలో లోగడ యూపీఏ ప్రభుత్వం సవరణ ప్రతిపాదిస్తే బెడిసి కొట్టిన అనుభవం పాలకపక్షాలకు తెలుసు. పార్టీలు ఆర్టీఐ పరిధిలోకొస్తాయని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని పార్టీలు ఇటు పాటించక, అవి చెల్లవని అటు న్యాయ స్థానంలో సవాల్ చేయకపోవడంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

 

 అమలు నిలిచిపోయింది. న్యాయ ధిక్కారం కింద తదుపరి విచారించే అధికారం లేదనే కారణంతో సీఐసీ కూడా మిన్నకుండిపోయింది. సీఐసీ ఉత్తర్వులు అమ లయ్యేలా జోక్యం చేసుకోవాలనే వినతితో సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్, ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్)కు చెందిన జగదీప్ ఎస్ చొక్కర్ సుప్రీంకోర్టును సంప్రదించారు. వారి తరపున ఆర్టీఐ ఉద్యమ కారుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ వాదనలు వినిపించారు. ప్రజలతో ముడివడి ఉండి, నిత్యం ప్రజావ్యవహారాలు నిర్వహిస్తూ తమ సంగతులేవీ ప్రజలకు తెలియకూడదనే పార్టీల వాదనను ఖండించారు. ఈ అనుచిత గోప్యత వల్ల, తెలుసుకునే పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర భంగం కలుగుతోందనే వాదన ఆయన వినిపించారు.

 

 పబ్లిక్ అథారిటీలు కాకుండా పోతాయా?

 సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం అవుతోంది. ‘మేం ఈ చట్టం పరిధిలోకి రాం’ అని వివిధ సంస్థలు, కార్యాలయాలు వేర్వేరు సందర్భాల్లో పేర్కొన్నపుడు సీఐసీ, వివిధ రాష్ట్రాల సమాచార కమిషన్లు విస్పష్టమైన తీర్పు లిచ్చాయి. స్టాక్ ఎక్స్చేంజీలు, విదేశీ నేలపైన ఉన్నప్పటికీ ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయని ఇచ్చిన ఆదేశాల్ని సదరు సంస్థలు, కార్యాలయాలు విధిగా పాటిస్తున్నాయి. అట్లాంటి ఆదేశాలే రాజకీయ పార్టీల విషయంలోనూ వెలువడ్డాయి.

 

 ఇలా నిర్ణ యించడానికి కారణం, ‘ప్రజావ్యవస్థ’ (పబ్లిక్ అథారిటీ) అంటే ఏమిటో, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్)లో స్పష్టమైన వివరణ ఉండటమే. రాజ్యాం గం ద్వారా, పార్లమెంటు-అసెంబ్లీ చేసిన ఏదైనా చట్టం ద్వారా, ఏవైనా ప్రభుత్వాదేశాలతోగానీ ఏర్పడిన వ్యవస్థ, సంస్థ, బాడీ అని ఉంది. అదే సమ యంలో...సెక్షన్ 2, (హెచ్)లోని ‘డి’ ప్రకారం (1) ప్రభుత్వ సొంత, అధీనం లోని, తగు నిధులు పొందినవి, (2) ప్రభుత్వేతరమే అయినా... కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తగు ఆర్థిక ప్రయో జనం/నిధులు పొందినవన్నీ ఈ నిర్వచనం పరిధిలోకొస్తాయి అని ఉంది. ఈ అంశం ఆధారంగానే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వం నుంచి, అంటే ప్రజాధనం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతు న్నాయి కనుక ప్రజావ్యవస్థల నిర్వచన పరిధిలోకి వస్తాయన్నది సీఐసీ ఉద్దే శం. ఈ చట్టం ఇదే రూపంలో ఉన్నంత కాలం కచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి.

 

 ఉదాహరణకు:

 -        రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల నిర్మాణానికి నామమాత్రపు ధరకు ప్రభుత్వ భూముల్ని పొందుతున్నాయి.

     -    వారు పొందే విరాళాలకు నూరు శాతం ఆదాయపన్ను మినహాయింపు లభిస్తోంది..

 -        ఎన్నికల సమయంలో పైసా చెల్లించకుండా టీవీ, రేడియో వంటి ప్రభుత్వ జనమాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి.

 -        చట్టసభల్లో, బయట పాలకపక్షంగా కొన్ని, ప్రతిపక్షంగా కొన్ని సదుపాయాల్ని ప్రజాధనం నుంచి పార్టీలు పొందుతున్నాయి.

 

 ఇవి కాకుండా కూడా రాజ్యాంగం, వివిధ చట్టాల ద్వారా రాజకీయ పక్షా లకు కొన్ని విశేషాధికారాలు సంక్రమిస్తున్నాయి. భారత రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం పార్టీలిచ్చే విప్‌కి, ఇతర ఆదేశాలకు లోబడి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నడచుకోవాల్సి ఉంటుంది. భిన్నంగా వ్యవహరిస్తే వారిని అన ర్హుల్ని చేసే ప్రక్రియ కూడా అందుబాటులో ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ విధి విధానాలకు లోబడి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 

 ఎన్నికల సంఘం నిబంధనావళికి లోబడి వ్యవహరించాలి. ఇవన్నీ రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణ పరిధిలోకి వస్తాయని నిర్ధారించే విషయాలే! స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం కూడా ఎన్నికలప్పుడు అఖిలపక్ష సమావే శాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యతనిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది. వాటికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా... ప్రజావ్యవస్థలు కామని, తమకు పారదర్శకత వర్తించదని, తమ సమాచారం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం లేదని రాజకీయ పక్షాలు ఎలా అనగలవు? పార్టీల పనితీరులో మరింత పారదర్శకత అత్యవస రమని 1999లోనే లా కమిషన్ తన 170వ నివేదికలో విస్పష్టంగా పేర్కొంది.

 

 గోప్యతే అనర్ధాలకు కారణం

 పాలనలో పారదర్శకత వల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనేది ఒక్క కార్య నిర్వాహక వ్యవస్థకే ఎందుకు వర్తిస్తుంది? రాజకీయ వ్యవస్థకెందుకు వర్తించ దనే ప్రశ్న ఉదయిస్తుంది. అన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కనుసన్నల్లో నడిపేవారి డబ్బు దందాలకు లెక్కలొద్దా? ఇవాళ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. సాధారణ వార్డు స్థాయి నుంచి శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల వరకు డబ్బే రాజ్యమేలుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడెని మిది ఎమ్మెల్యే ఓట్లను అడ్డగోలుగా వశపరచుకునేందుకు 150 కోట్ల రూపా యల వరకూ వెచ్చించేందుకు ఓ అధికారపక్షం సిద్ధమైన వైనం గగుర్పాటు కలిగిస్తోంది.

 

 5 కోట్ల ఒప్పందంలో భాగంగా 50 లక్షల నోట్ల కట్టలతో దర్యాప్తు సంస్థకు ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా... బుకాయింపులకు తక్కువ లేదు. మహానాడులో ప్రకటించే లక్షల కొలది రూపాయల విరాళాల లెక్కలేవీ ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించే గణాంకాల్లో ప్రతిబింబించవు. రాజ కీయ పక్షాల నడతలో, వాటి జమాఖర్చుల్లో, ఇబ్బడిముబ్బడిగా పారే విరా ళాల్లో, అవిచ్చే దాతల వనరుల గుట్టుమట్లలో పారదర్శకత లేనంతవరకు.... ఎక్కడో విదేశీ బ్యాంకుల్లో మగ్గిన నల్లధనాన్ని నట్టింటికి రప్పిస్తామనడం పచ్చి బూటకం. రాజకీయపక్షాల ఆదాయ వ్యయాలకు ముసుగుకప్పి, డబ్బు తో ఓట్లు కొంటూ అధికారాన్ని పిడికిట పట్టే వ్యవహారం సాగుతున్నంత కాలం వారినాశ్రయించి ఉండే అజ్ఞాత దాతల నల్లధనం రాశులు ఇంటా బయ టా మరింత పేరుకుపోతాయి తప్ప తరగవు. తెలుసుకోవడం ప్రజల హక్కు. తెలియజెప్పడం రాజకీయపక్షాల బాధ్యత!

(వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్)

dileepreddy@sakshi.com   

- సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,

దిలీప్ రెడ్డి   
                           

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top