నేరమే అధికారమై ప్రజలను వేటాడుతున్న చోట...!

నేరమే అధికారమై ప్రజలను వేటాడుతున్న చోట...!


అవలోకనం

 

సామూహిక హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వాటిలో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత  మనుషులను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఢిల్లీలో సిక్కుల ఊచకోత, భోపాల్ విషవాయువు లీక్, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర మత ఘర్షణలు, గుజరాత్ మారణకాండ వంటి ఘటనల్లో బాధితులు నేటికీ తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం.

 

 మన సామూహిక జాతీయ విషాదాలు అనేకం కాబట్టి, వాటిని లెక్కిం చడం కూడా కష్టమే అవుతుంది. నేను 40ల మధ్య వయసులో ఉన్నాను. వేలాదిమంది హత్యకు దారితీసిన కనీసం అయిదు ఘటనలు కలుగ జేసిన గాయాలు నాకు వ్యక్తిగతంగా కూడా గుర్తున్నాయి. ఈ మారణ కాండలు ఏవంటే , 2 వేలమంది ముస్లింలను చంపిన 1983 నాటి నెల్లి హత్యాకాండ, 1984 డిసెంబర్‌లో 3 వేలమంది మరణాలకు దారితీసిన భోపాల్ విషవాయు ప్రమాదం. తర్వాత అదే నెలలో ఢిల్లీలో 2 వేల మంది సిక్కుల ఊచకోతకు దారితీసిన ఇందిరాగాంధీ హత్యానంతర దాడులు, బాబ్రీమసీదును కూల్చివేసిన అనంతరం 1992లో దేశ వ్యాప్తంగా వేలాదిమంది హత్యకు దారితీసిన ఘటనలు (ఆనాటికి నేను 20లలో ఉండేవాడిని, నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు పూర్తిగా బోధపడేది). తర్వాత 2002లో గుజరాత్‌లో కనీసం వెయ్యిమంది హత్యకు దారితీసిన హింసాత్మక దాడులు.



 దేశంలో జరిగిన మరికొన్ని ప్రధాన ఘటనలను వదిలిపెట్టాననడంలో సందే హమే లేదు. బోటు ప్రమాదాల్లో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘట నలు జరిగాయి. మరోవైపున ప్రకృతి వైపరీత్యాలలో వేలాదిమంది చనిపోతున్నా, ప్రభుత్వాలు తమ పౌరులకు ఎలాంటి సహకారం అందించలేని పరిస్థితిలో ఉండేవి. నేనిక్కడ వేలాది కశ్మీరీల హత్య గురించి, పండిట్‌ల వలస గురించి పొందుపర్చడం లేదు. ఎందుకంటే, ఇవి ఒక ఘటనలో కాకుండా నెలలు లేదా సంవత్సరాల పరిణామ క్రమంలో జరుగుతూ వచ్చాయి.



 ఇక్కడ నేను పొందుపర్చిన హింసాత్మక సందర్భాల్లో బాధితులకు న్యాయం అనేది అంత సులభంగా దక్కలేదు. వీటిలో ఒక్కటంటే ఒక్క ఘటన ఫలితాలను, వాటి పర్యవసానాలను పరిశీలించినట్లయితే ఒక జాతిగా మనం పూర్తిగా పతన మైన విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వీటిని నిష్పక్షపాత దృష్టితో మనం చూసినట్లయితే,  తీవ్రనేరాలకు పాల్పడిన వారిపై తగిన విధంగా దర్యాప్తు చేసి, వారిని జవాబుదారులను చేయడంలో మన వైఫల్యం స్పష్టమవుతుంది.



 మన దేశంలో జరుగుతున్న సామూహిక హింసాత్మక ఘటనలకు సంబం ధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, హింసా ఘటనల్లో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత ప్రజలను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఉదాహరణకు, పై ఘటనల్లో చివర పేర్కొన్న గుజరాత్ హింసాకాండకు సంబం ధించి తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. ఈ ఉదాహరణను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ ఘటన గురించి నాకు బాగా తెలుసు. పైగా గుజరాత్ హింసాకాండకు చెందిన కొన్ని అంశాలను పరిశీలించడానికి భారత సంపాదక మండలి పంపిన త్రిసభ్య కమిటీలో నేనూ భాగం పంచుకున్నాను.



 ఢిల్లీలో 1984లో సిక్కుల హత్యాకాండపై దృఢవైఖరితో వ్యవహరించడం ద్వారా ఈ నిరాశా నిస్పృహల వలయాన్ని ఛేదించడానికి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. సిక్కుల ఊచకోత ఘట నలో పాలుపంచుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండుగులను ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ వచ్చారని బీజేపీ చాలాకాలంగా ఆరోపిస్తోంది.



 కేంద్రంలో అధికారం చేపట్టాక, ఎన్డీయే కూటమి ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించింది. ఢిల్లీలో హింసాకాండ సందర్భంగా జరిగిన దాడులపై తగిన విధంగా దర్యాప్తు జరగలేదని, దర్యాప్తు రూపాన్ని మార్చేందుకోసం ఒక కపట ప్రయత్నం చేశారని ఈ కమిటీ కనుగొంది.

 దీంతో ఇంతవరకు పరిశోధన జరగని కేసుల్లో తాజా ఎఫ్‌ఐఆర్ నివేదికలు, నేరారోపణలను నమోదు చేయడానికి ఎన్టీయే ప్రభుత్వం ఒక త్రిసభ్య బృందాన్ని ఏర్పర్చింది.



 మూడు దశాబ్దాల క్రితం ఊచకోతకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో ఈ బృందం నిర్ణయాత్మకంగా, దృఢంగా, శరవేగంగా స్పందిస్తుందని నేను ఆశించాను. ఢిల్లీ హత్యాకాండకు సంబంధించిన కేసులు చాలా పాతబడిపోయాయని, వాటిని పునరుద్ధరించడం చాలా కష్టమని పలువురు భావిస్తున్నప్పుడు, ఢిల్లీ హింసాకాండ బాధ్యులను శిక్షించినట్లయితే, భారతీయుల రక్తాన్ని చిందిస్తున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టమని మనలో చాలా మందికి అది కాస్త నమ్మకాన్నిచ్చి ఉండేది.



 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ  కమిటీని నియమించారు. ఐపీఎస్ అధికారి ప్రమోద్ అస్థానా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందంలో మరొక పోలీసు అధికారి కుమార్ గ్యానేష్, రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి  రాకేష్ కపూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ హత్యాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేసిన లేదా తగిన విధంగా పరిశీలించని సాక్ష్యాధారాల పరిశీలనకోసం ప్రభుత్వం ఈ ముగ్గురికీ ఆరునెలల సమయాన్ని ఇచ్చింది. ఆరు నెలల తర్వాత అంతవరకు వారేం చేశారన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే కమిటీ విచారణను మరికొంత కాలం పొడిగించింది. కొన్ని వారాల క్రితం నాటి కారవాన్ సంచికలోని ఒక నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించి, ఈ బృందం సాధించిందేమీ లేదని తేల్చేసింది.



 ఢిల్లీ మారణకాండ బాధితులకు, వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది హెచ్‌ఎస్ ఫోల్కా చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. ఆయనిలా అన్నారు. ‘‘సిట్‌ను ప్రభుత్వం ఏర్పర్చినప్పుడు దాన్నుంచి చాలా ఆశించాం. కానీ వీరు ఈ కేసుకు సంబంధించిన ఏ అంశంపైనా అడుగు ముందు కేసింది లేదు. ఆ హత్యాకాండ బాధితుల్లో ఏ ఒక్కరినీ వీరు కలిసిన పాపాన పోలేదు. బాధితుల్లో ఒకరు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక ఫిర్యాదు పంపి నప్పుడు, ఏ వ్యాఖ్య చేయకుండానే దాన్ని వెనక్కి పంపించారు. కనీసం ఆ ఫిర్యాదును వారు అంగీకరించలేదు.’’



 వాస్తవానికి సిట్ ఏర్పాటే ఒక మాయ అని, దాన్నుంచి దేన్నీ కోరుకోకుండా, ఆశించకుండా, కేవలం తాము సిట్‌ను ఏర్పర్చామన్న పేరు కొట్టేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆ లాయర్ పేర్కొన్నారు. ఇది నిజం కాదనే నేను భావిస్తున్నాను.

 సిక్కులపై హింసాకాండను నిరోధించడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత విషయంలో సందేహమే లేదు. ఆ పార్టీకి చెందినవారే స్వయంగా నాటి మారణకాండలో పాల్గొన్నారంటూ వారిపై తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయి.



 ఇలాంటి నేరస్తులపై దృఢంగానూ, నిర్ణయాత్మకంగానూ వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తన వైఖరిని ప్రదర్శిస్తే, భారతీయులకు అది గొప్ప సేవ చేసినట్లే. కనీసం ఈ ఒక్క మారణకాండకు సంబంధించినంతవరకయినా న్యాయం సాధ్యమేనని ప్రభుత్వ దృఢవైఖరి సూచిస్తే అదే చాలు.


http://img.sakshi.net/images/cms/2015-07/51437852864_Unknown.jpg

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్

aakar.patel@icloud.com

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top