ఇందులో 22 కథలున్నాయి. దాదాపు ఐదేళ్ల కాలంలో రాసినవివన్నీ.
అద్దంలో అటువైపు
కథకుడు: డాక్టర్ యండమూరి సత్యకమలేంద్రనాథ్; పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: నవసాహితి బుక్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ-2. ఫోన్: 0866-2432885
ఇందులో 22 కథలున్నాయి. దాదాపు ఐదేళ్ల కాలంలో రాసినవివన్నీ. ‘చాలా కథల్లో ముఖ్యపాత్ర డాక్టరుదవటానికి, బహుశా ఈ రచయిత అదే వృత్తిలో ఉండటం కారణం కావచ్చు. అయితే తనకు తారసపడిన వివిధ రకాల పేషెంట్ల మనస్తత్వ విశ్లేషణ ఈ కథల్లో కనబడుతుంది. అంతేకాదు, కొంత రొమాన్సు, కొంత కవిత్వం, హాస్యం కూడా ఇందులో ఉన్నాయి’.
మరణం అంచున
రచన: వర్ధెల్లి వెంకటేశ్వర్లు; పేజీలు: 110; వెల: 75; ప్రతులకు: పెద్ద పుస్తక షాపులతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36.
‘ఒక అనాదిజాతి(చెంచు) యావత్తూ మరణం అంచుకు నెట్టబడిన అమానుష సన్నివేశానికి మానవీయ దర్పణం ఈ పుస్తకం’. చెంచుల పట్ల అమితమైన తపనతో పదేళ్లపాటు నల్లమలలో తిరిగి రూపొందించిన పాత్రికేయ డాక్యుమెంట్. చెంచుల ఆహారపు అలవాట్లు, వివాహ వ్యవస్థ, ఆచారాలు, పండుగలతోపాటు వారి మనుగడను దెబ్బతీస్తున్న అంశాలను ‘నిఖార్సయిన సమాచారం’తో వెల్లడించిన రచన.
తూరుపు వలస
రచన: మన్నె సత్యనారాయణ; పేజీలు: 156; వెల: 75; ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్, డాక్టర్ ఎ.ప్రేమ్‌చంద్ కాంప్లెక్స్, అశోక్‌నగర్, విజయవాడ-10; ఫోన్: 9866115655
‘ఆంధ్రదేశంలో ఒకపుడు జరిగిన అతి పెద్ద వ్యవసాయ వలస ద్వారా ఏర్పడిన ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక సమ్మేళనాలను పరిశీలించి వ్రాయబడిన తెలుగువారి కథ. విస్మరింపబడిన సమీపగతంలోని జీవన పరిస్థితులు, పరిభాష, ప్రజా చిత్రాన్ని నేటి తరం వారికి తెలియ చెప్పే నవల’.
వాడుక భాష - రాసే భాష
రచన: ఉన్నం వెంకటేశ్వర్లు; పేజీలు: 96; వెల: 50; ప్రతులకు: కె.ఉషారాణి, 12-628/25, 26, 6వ క్రాస్ రోడ్డు, సుందరయ్య నగర్, తాడేపల్లి, గుంటూరు జిల్లా-522501; ఫోన్: 9618976880
ఎందరో పాత్రికేయులకు శిక్షణ ఇచ్చిన ‘వి.వి.’ చెబుతున్న భాషా పాఠాలు ఇవి. అచ్చు తప్పులు, వాక్య నిర్మాణంలో దోషాలు, పదబంధాలు, వాడుకలో లేని మాటలు, రచనాశైలి మెరుగుపరుచుకోవడం లాంటి అంశాలను సుబోధకంగా వివరించిన పుస్తకం. వర్తమాన జర్నలిస్టులకు ఉపయుక్తం.
తంగేడు వనం
సంపాదకుడు: మామిడి హరికృష్ణ; పేజీలు: 350; ప్రతులకు: డెరైక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్.
‘ప్రపంచ సాహితీ చరిత్రలో తంగేడు పూలపై అత్యధిక కవితల సంకలనం’గా వెలువడిన ఈ పుస్తకంలో 166 కవితలున్నాయి. బతుకమ్మకూ బతుకమ్మలో ప్రధాన పేర్పుగా ఉండే తంగేడుపూలకూ తెలంగాణ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. అట్లాంటి తంగేడు పూలకు ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ’ అర్పించిన నివాళి ఇది.