చలనశక్తే సాధికారత

చలనశక్తే సాధికారత


ఆలోచనం

చలనశక్తి మహిళల కదలికలనే కాదు, వారి ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. ఇప్పుడు మహిళలకి కావల్సినది, వారినో మూలన ఉంచి అన్నలిచ్చే రక్షణ కాదు. స్వతంత్రతనిచ్చే చలనశక్తే.



అర్ధరాత్రి రహదార్లపై ఒక మహిళ స్వేచ్ఛగా నడవగలిగిన రోజే, భారతదేశం తన స్వాతంత్య్రాన్ని సాధించిందని మనం చెప్పగలం అన్నారు గాంధీ. ఆ వ్యాఖ్య రక్షణ గురించే కాకుండా అంతర్లీనంగా స్త్రీ మొబిలిటీ (చలన శక్తి)ని కూడా ప్రస్తావించిందేమో.. తెరాస ఎంపీ కవిత ‘‘సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌’’ అని రక్షాబంధన్‌ రోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి స్లోగన్‌ ‘‘అన్న మనకు రక్ష–అన్నకు హెల్మెట్‌ రక్ష’’. రాఖీ కట్టి హెల్మెట్‌ ఇచ్చి సోదరుల ప్రాణాలను ప్రమాదాలనుంచి కాపాడండి అని ఆ కార్యక్రమ సందేశం. ఇందులో మనకు బాహ్యంగా కనిపిస్తున్న అంశం తోడబుట్టిన వారి మీద ప్రేమ. కానీ ఈ నినాదం చాలా బలమైన మూస ధోరణిలో పురుషస్వామ్యాన్ని మళ్లీ నొక్కి చెబు తోంది. చలనశక్తి ఉన్న అన్నకు హెల్మెట్‌ రక్ష, ఇంట్లో వుండే ఆడవాళ్లకు అన్న లేదా మరో మగవాడు రక్ష అనే భావజాలాన్ని ఇది వ్యాపింపచేస్తుంది.



‘జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పేరుతో వరల్డ్‌ బ్యాంకు 2012లో ప్రచురించిన రిపోర్టుకి ‘జెండర్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌ ది డెవలపింగ్‌ వరల్డ్‌’ అనేది ఒక  నేపథ్య వ్యాసం. అందులో వారు ప్రొఫెసర్‌ సెలెస్ట్‌ లాంగన్‌ పేర్కొన్న ‘మొబిలిటీ డిసెబిలిటీ’ భావనని ఉటంకించారు. రూసో తన ‘సోషల్‌ కాంట్రాక్టు’లో..  పరుగెత్తాలని ఆరాటపడే శారీరక వైకల్యంగల వ్యక్తీ, శారీరకంగా అంతా బాగుండి ఆ కోరిక లేని వ్యక్తీ ఇద్దరూ ఒక్క చోటే ఉండిపోతారంటారు. ఈ మాటల్ని లాంగన్‌ ఖండిస్తారు. సామాజిక వాతావరణం, ఆచారాలే చలన శక్తిని, చలన హీనతను సృష్టించగలవు. ఇవి సర్వాంగాలు సక్రమంగా ఉన్న వ్యక్తిని కూడా చలనహీనుల్ని చేయగలవు. సమాజం, ఆచారాల పేరిట స్త్రీలను అలా నిస్సహాయులను చేసింది అంటారామె. స్త్రీలు కీలక  స్థానాలలో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో అనే అభిప్రాయం ఈ వ్యాసాలలో వ్యక్తమయింది కానీ, పురుషులు స్త్రీల శరీరాలనే కాదు మెదడులను కూడా నియంత్రించారు కదా. అందుకే కీలక పదవులలో ఉన్న కొద్దిమంది స్త్రీలు కూడా పైకి ఆధునికులుగా కనిపిస్తూ వెనుకబాటు భావజాలాన్నే ప్రచారం చేస్తుంటారు.



స్త్రీవాద ఉద్యమమిచ్చిన చైతన్యాలలో చలనశక్తి కూడా ఒకటి. 1896 సంవత్సరంలో అమెరికన్‌ సివిల్‌ రైట్స్‌ లీడర్‌ సుసాన్‌ బి ఆంథోనీ ‘ద్విచక్ర వాహనం స్త్రీలకు చాలా  విముక్తిని ఇచ్చింది. అది ఎక్కిన మరుక్షణం వారికి స్వావలంబన భావాలు కలుగుతాయి’ అంటారు. నా భర్త  ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాలలో ఉన్నపుడు నేను నా స్కూటీపై కూతుర్ని తీసుకుని చుట్టుపక్కల సంతాలీ పాడాలు తిరిగేదానిని. నా మొబిలిటీ నాకిచ్చిన స్వేచ్ఛ వారిని నాకు స్నేహితుల్ని చేసింది. నెల్లూరులో నాకొక స్నేహితురాలు ఉంది. చిన్నప్పుడు తన సైకిల్‌పై మేమిద్దరం డబుల్స్‌ వెళ్ళేవాళ్ళం. నవ్వులే నవ్వులు. కావలసినంత స్వేచ్ఛ. గత పదిహేనేళ్లుగా తన భర్త సౌదీలో ఉద్యోగం చేస్తూ ఉంటే, తాను ఇక్కడ పిల్లల్ని చదివిస్తూ ఉంది. సైకిల్‌ నుంచి స్కూటర్‌కు, కార్‌కు మారింది. మొబిలిటీ మా జీవితాలకు సుఖాన్నిచ్చింది. కష్ట సమయాలలో స్థైర్యాన్నిచ్చింది. అదే మాట్లాడుకుంటూ ఎవరైనా రాజకీయనేత డిగ్రీ అమ్మాయిలకు ఉచితంగా స్కూటీనిచ్చే స్కీమ్‌ పెడితే బాగుండును, అది వారిలో ఎంతో ధైర్యం నింపుతుంది కదా అనుకున్నాం. బిహార్‌ ప్రభుత్వం 9వ తరగతి అమ్మాయిలకు సైకిళ్ళ పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టినపుడు దాని ప్రభావాలపై కేంబ్రిడ్జి కోసం పరిశోధన చేసిన కార్తీక్‌ మురళీధరన్, నిషిత్‌ ప్రకాష్‌లు కూడా అమ్మాయిల మొబిలిటీ భావితరాల్ని ప్రభావితం చేయబోతోందన్నారు.



ఈ ప్రపంచీకరణ సమాజంలో, మొబిలిటీ స్త్రీల పేదరికంపై చూపిస్తున్న ప్రభావం గురించి కూడా అనేక పరిశోధనలు జరిగాయి. పేద స్త్రీలు పనికి నడిచి వెళుతున్నారని, వాహనాలు ఎక్కలేక, పని ప్రదేశాలకు ఆలస్యంగా చేరుతున్నారనీ, దీని వలన వీరికి పేదరికం నుంచి బయటపడే అవకాశాలు తగ్గిపోతున్నాయనీ తెలుస్తున్నది. ప్రస్తుతం నేను నివాసముంటున్న బెంగాల్‌కి, తెలుగు సమాజానికి మధ్య నేను గమనించిన ప్రధానమైన తేడా మొబిలిటీనే. బెంగాల్‌లో పేద స్త్రీలు సైకిల్‌ని చాలా ఎక్కువగా వినియోగిస్తారు. మొబిలిటీ నా పరిశీలన మేరకు మన కదలికలనే కాదు, ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. మన దేశంలో చాలా సార్లు సర్పంచ్‌ భర్తలు, తామే సర్పంచులమని చెప్పుకుంటారు.



ఉత్తర భారత్‌లో ప్రధాన్‌ పతి (సర్పంచ్‌ భర్త) అనే కొత్త పదం కూడా పుట్టింది. బెంగాల్లో సర్పంచుల భర్తలెవరో కూడా ప్రస్తావనకు రాదు. స్త్రీ సాధికారతకు మొబిలిటీకి ఉన్న సంబంధానికి ఇదో ఉదాహరణ. అంతెందుకు చిన్నప్పుడు చరచరా సైకిల్‌పై వీధులన్నీ చుట్టపెట్టేదట మమతా బెనర్జీ. ఆమెని రక్షించే, లేక రక్షిస్తున్న అన్నల గురించి మీరెప్పుడైనా విన్నారా? అందుకేనేమో ఆమె ‘సబూజ్‌ సాథీ’ పేరిట అమ్మాయిలకు 45 లక్షల సైకిళ్ళు పంపిణీ చేసి, వాహనమే మీ నేస్తం అనే సందేశాన్నిచ్చారు. ఇలా రాజకీయ నేతలు ఇప్పుడు జరుగుతున్న సామాజిక ఉద్యమాల గురించి వారి డిమాండ్ల గురించి తెలుసుకుని ఉంటే బాగుంటుంది కదా. కొంత స్త్రీవాద స్పృహ అలవరచుకొంటే, ఎంతో చురుకుదనం ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా ‘‘అన్నలు, చెల్లెళ్లకి మోటార్‌ బైక్‌ నడపడం విధిగా నేర్పించండి, చెల్లెళ్లకి హెల్మెట్లు బహుమతులుగా ఇవ్వండి’’ అనేవారేమో.



లోపలి లోకాలను తాకే ‘‘సంచారమే ఎంత బాగున్నది’’ పాటలో గోరటి వెంకన్న ‘‘మూలనున్నవి మురిగి  పోతున్నవి, సంచరించేవి శక్తితోనున్నవి’’ అంటారు. నిజం! ఇప్పుడు  స్త్రీకి కావల్సినది, ఆమెనో మూలన ఉంచి అన్నలిచ్చే రక్ష కాదు. స్వతంత్రతనిచ్చే మొబిలిటీనే.



వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

సామాన్య కిరణ్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top