నెహ్రూ నేరం ఏమిటి? | jawaharlal nehru made any mistake | Sakshi
Sakshi News home page

నెహ్రూ నేరం ఏమిటి?

Nov 8 2015 1:25 AM | Updated on Sep 3 2017 12:11 PM

నెహ్రూ నేరం ఏమిటి?

నెహ్రూ నేరం ఏమిటి?

కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు నాయకత్వ స్థానంలో నిలిచాయి. అదే రకమైన భావజాలాల ప్రాతిపదికగా సమాజంలోనూ సమీకరణాలు జరుగుతున్నాయి.

త్రికాలమ్
కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు నాయకత్వ స్థానంలో నిలిచాయి. అదే రకమైన భావజాలాల ప్రాతిపదికగా సమాజంలోనూ సమీకరణాలు జరుగుతున్నాయి. ఇవి మర్యాదకు లోబడి, చర్చకు పరిమితమైనంత కాలం ప్రమాదం లేదు. అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అది ఆరోగ్య లక్షణమే. కానీ షారుఖ్ ఖాన్‌ని పాకిస్తాన్‌కు వెళ్ళిపొమ్మనడం, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌ఐతో పోల్చడం దారుణమైన తీవ్రవాద వైఖరులే. నెహ్రూ స్వప్నించిన భారత్‌ను ఛిద్రం చేసేవే.
 
దేశంలో ప్రబలుతున్న అసహనం పట్ల ఆగ్రహంతో ఒక ప్రదర్శన, అసహనంపై ఆగ్రహం పట్ల అభ్యంతరం వెలిబుచ్చుతూ పోటీ ప్రదర్శన. ఒకటి కాంగ్రెస్ అధ్య క్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో. రెండోది బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నేతృత్వంలో. మతసహనంపైన పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన రెండు శ్రేణుల ప్రతినిధులనూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలుసుకొని వారి వాదనలు విని పంపించివేశారు. ప్రణబ్‌దా స్వయంగా అసహనంపైన రెండు వారాలలో రెండు విడతలు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో ఒక రాష్ట్రపతి దేశంలో మతసహనం ఆవశ్యకతను నొక్కివక్కాణించిన సందర్భం ఇదే.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంగా మతసామరస్యంపైన వేడి, వాడి చర్చకు ఢిల్లీ వేదిక కావడం విశేషం. భిన్న మతాలూ, భాషలూ, ప్రాంతాలూ, సంస్కృతులకు వేదికైన దేశంలో ఏమి జరిగే ప్రమాదం ఉన్నదని నెహ్రూ భయపడ్డాడో సరిగ్గా అదే జరుగుతోంది. స్వేచ్ఛ, బహు ళత్వం, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం మాత్రమే భిన్నత్వంలో ఏకత్వం సాధించి ఇండియాను సమైక్యంగా ఉంచగలవని ప్రగాఢంగా విశ్వసించిన ప్రజానాయకుడు నెహ్రూ. భారత స్వాతంత్య్ర సమరానికి గాంధీజీ సారథ్యం వహిస్తే, వందల సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతదేశానికి సమగ్ర స్వరూపం ప్రసాదించిన ఘనత సర్దార్ పటేల్‌ది. నవభారత నిర్మాణా నికి బలమైన పునాదులు వేసిన దార్శనికుడు పండిట్ నెహ్రూ. ఎవరు అవు నన్నా, కాదన్నా ఇది చరిత్ర.
 
నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ప్రధానిగా ఏ భావజాలాన్ని అయితే నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాడో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్రమోదీ 2014 లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ క్షణం నుంచి నెహ్రూ విధానాలకూ, భావాలకూ, విలువలకూ గ్రహణం పట్టబోతున్నట్టు ప్రచారం ఆరంభమైంది. గాంధీ-నెహ్రూ వంశ పాలనపై ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారం ఊపందుకున్నది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే ముగ్గురు నేతల హత్యలు జరగడం, కొందరు బీజేపీ నాయకులు బాధ్య తారహితంగా ప్రకటనలు చేయడంతో చాలామంది కళాకారులూ, రచయితలూ సాహిత్య అకాడెమీ అవార్డులనూ, పద్మపురస్కారాలనూ తిరిగి ఇచ్చివేయడంతో దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది.

‘అవార్డు వాపసీ’ కార్యక్రమం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదనీ, కాంగ్రెస్ హయాంలో అవార్డులూ, రివార్డులూ పొందినవారు మోదీనీ, ఆయన ప్రభుత్వాన్నీ పలచన చేయడానికి నిరసన పేరు మీద అవార్డులు తిరిగి ఇచ్చి వేస్తున్నారనీ ప్రస్తుత పాలకులకు సానుకూలురైన రచయితలూ, కళాకారులూ విమర్శిస్తున్నారు. ఇదివరకు కొందరిని సూడో సెక్యులరిస్టులు అంటూ అపహాస్యం చేసినట్టుగానే ఇప్పుడు ‘సోకాల్డ్ ఇంటలె క్చువల్స్’ అంటూ అవార్డులు వెనక్కి ఇస్తున్నవారిని వెక్కిరిస్తున్నారు. అరుంధతీ రాయ్‌ని, పుష్పాభార్గవ్‌ని, ఆనంద్ పట్వర్థన్‌ని, నయనతారా సెహగల్‌ని ‘సోకాల్డ్ ఇంటలెక్చువల్స్’ అంటే వారికి వచ్చే నష్టం ఏమీ లేదు. వారు రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సినీ దర్శకులుగా సుప్రసిద్ధులు. ఇది కృత్రిమంగా సృష్టించిన అసహనమే కానీ సహజ సిద్ధమైనది కాదనీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పదే పదే చెబుతున్నారు.

అసహనంపైన వ్యాఖ్యానించినందుకు హీరో షారుఖ్ ఖాన్‌పైన బీజేపీ గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, సాధ్వీ ప్రాచీ పేలిన అవాకులూ చెవాకులకూ బిహార్ ఎన్నికలకూ సంబంధం ఉన్నదో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటారంటూ బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించడం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓబీసిల రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఆరోపించడం ఓటర్లను మత ప్రాతిపదికపైన ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలుగానే చూడవలసి వస్తుంది.

ఉదార విలువల పాతర
అసహనం పేరుమీద జరుగుతున్న నిరసన ప్రదర్శనలకీ, చరిత్రలో నెహ్రూ స్థానం తగ్గించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదనే ఆరోపణకీ సంబంధం ఉన్నదా? నెహ్రూ బోధించిన, పాటించిన ఉదారవాద విలువలకు ఇప్పుడే ప్రమాదం ముంచుకొచ్చిందనే కాంగ్రెస్ ప్రచారంలో నిజం ఉన్నదా? వాస్తవా నికి భారత ప్రధానులలో ఉదారవాదులుగా చెప్పుకోదగినవారు ఇద్దరే- జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజపేయి. నెహ్రూ ఉదారవాదానికి ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించి గండికొట్టిన వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇతరత్రా ఇందిర సాధించిన విజయాలు ఏమైనప్పటికీ న్యాయవ్యవస్థనూ, పార్లమెంటరీ వ్యవస్థనూ భ్రష్టుపట్టించింది ఆమె హయాం లోనే.

ముఖ్యమంత్రులను సీల్డ్ కవర్లతో నియమించింది ఇందిరే. శిలాన్యాస్‌కు అనుమతించడం, షాబానో కేసులో ముస్లిం మహిళల ప్రయోజనాలకు విఘా తం కలిగించడం ద్వారా నెహ్రూ మనమడు రాజీవ్ గాంధీ లౌకిక విలువలకు భంగం కలిగించాడు. నిజానికి, నెహ్రూ తర్వాత కాంగ్రెస్ నాయకులలో అత్య ధికులు ఇండియాను రెండు మతాల (హిందూ, ఇస్లాం) సమాఖ్యగానే భావిం చారు. ముస్లింలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ పరిగణించిందనే మిత వాదుల వాదనలో నిజం లేకపోలేదు. కనుక నెహ్రూ విలువలకు మోదీ ఇప్పుడు కొత్తగా పాతర వేస్తున్నాడనే విమర్శ అర్ధరహితం. నెహ్రూ విధానాలపైన బీజేపీ చేస్తున్న దాడిని కాంగ్రెస్ ఒంటరిగా ఎదుర్కోగలదంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించడం హాస్యాస్పదం.

ఢిల్లీ వీధులలో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయ నాయకులలో, రచయితలలో, మేధావులలో, కళాకారులలో పెరుగుతున్న అసహనానికి సంకే తమా? అతివాద, మితవాద శిబిరాలుగా సమాజం చీలిపోతున్నదనడానికి నిదర్శనమా? బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో ఢిల్లీలో, ముంబైలో సంభవించిన పరిణామాల ప్రభావం ఎన్నికల ఫలితాలపైన ఏ మేరకు ఉంటుం దనే ప్రశ్నకు ఈ రోజు సమాధానం లభిస్తుంది. కానీ అసహనంపైన చర్చ బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టవలసిన అవసరం ఉన్నదని రాజకీయ పార్టీలు భావించినప్పుడు అస్థిరత అనివార్యం. ఇండియా వంటి దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. బిహార్ తర్వాత పశ్చిమబెంగాల్, అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

చర్చ బాధ్యతాయుతంగా, వాస్తవాల ప్రాతిపదికపైన జరగకుండా నిగూఢమైన ప్రయోజనాల కోసం వాస్తవాల వక్రీకరణ జరిగినప్పుడూ, తమ వాదనకు బలం చేకూర్చే అంశాలను మాత్రమే స్వీకరించి, బలహీనపరిచే అంశాలను బుద్ధి పూర్వకంగా విస్మరించినప్పుడూ అది టీవీలలో నిత్యం చూస్తున్న రచ్చ అవు తుందే కానీ నిర్మాణాత్మకమైన చర్చ కాజాలదు.
 దేశంలో అసహనం ఇప్పుడే పెరిగిందా? 1984లో సిక్కుల ఊచకోత జరిగి నప్పుడు మీరెక్కడున్నారు? ఎందుకు అవార్డులు అప్పుడు వాపసు చేయలేదు? 1992లో బాబరీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన ప్పుడు ఎందుకు నిరసన ప్రకటించలేదు? అంటూ ప్రశ్నించే మేధావులూ, టీవీ యాంకర్లూ 2002 నాటి గుజరాత్ పరిణామాలను ప్రస్తావించరు. గుజరాత్  గురించి మాట్లాడేవారు సిక్కుల మారణకాండ గురించి ప్రస్తావించరు. అన్ని వాస్తవాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్య పరిష్కారానికో, మార్గదర్శ నానికో ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుంది.
 
 మూడు గ్రంథాలు
 స్వాతంత్య్ర సమర కాలంలో నెహ్రూ పదేళ్ళ జైలు జీవితంలో మూడు బృహత్ గ్రంథాలు రచించాడు. ఒకటి, కుమార్తె ఇందిరకు రాసిన లేఖలు- గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. రెండు, డిస్కవరీ ఆఫ్ ఇండియా. మూడు, ఆత్మకథ. 1947 ఆగస్టు 15న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు మాసాలకే నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం ప్రారంభించాడు. రెండు వారాలకు ఒక లేఖ చొప్పున ఆయన అధికారంలో ఉన్న 17 సంవత్సరాలూ బీరుపోకుండా రాశాడు. 1964లో కన్నుమూయడానికి కొన్ని మాసాల ముందు వరకూ ముఖ్య మంత్రులతో లేఖల ద్వారా సంభాషణ సాగుతూనే ఉన్నది. దేశం చీలిపోయి పంజాబ్‌లో వేలమంది హిందువులూ, సిక్కులూ, ముస్లింలూ మరణించిన సమయంలో, మతోన్మాదం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్న పాడుకాలంలో నెహ్రూ ప్రధానిగా పగ్గాలు చేతబట్టారు. అయిదు మాసాలు తిరక్కుండానే మహాత్మాగాంధీ హత్య జరిగింది.

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం గాంధీని బలి తీసుకున్నదని నెహ్రూ అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌పైన శాశ్వత నిషేధం విధిం చాలని వాదించాడు. దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ అందుకు అంగీకరిం చలేదు. నిషేధం విధించి కొంత కాలం తర్వాత ఎత్తివేశారు. దేశం చీలిపోవ డానికి నెహ్రూ కారకుడని ఆర్‌ఎస్‌ఎస్ బలంగా నమ్ముతోంది. ‘ఇండియా విన్స్ ఫ్రీడం’లో మౌలానా ఆజాద్ నెహ్రూనీ, పటేల్‌నీ దోషులుగా నిలబెడతారు. జిన్నాతో సమాలోచనలు జరపడానికి వీరిద్దరూ నిరాకరించారనీ, దేశ విభజనే వారి అభిమతమనీ ఆజాద్ అభిప్రాయం. కానీ నెహ్రూ కంటే పటేల్‌నే ప్రధాన కారకుడుగా (ది ఫౌండర్ ఆఫ్ పార్టిషన్) ఆజాద్ అభివర్ణించాడు. చైనాతో యుద్ధం హిమాలయ సదృశమైన వైఫల్యం అనడంలో అతిశయోక్తి లేదు. షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయడం నెహ్రూ చేసిన అనేక తప్పిదాలలో ఒకటి.

దాదాపు అర్ధ శతాబ్దం రాజకీయాలలో అత్యంత కీలకస్థానంలో ఉన్న వ్యక్తి కొన్ని పొర బాటు నిర్ణయాలు తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. బహుళార్థ సాధక నీటి ప్రాజె క్టులను నిర్మించి, వివిధ దేశాల సహకారంతో ఐఐటీలను నెలకొల్పి, ఉక్కు కర్మా గారాలనూ, అణుశాస్త్ర పరిశోధనకూ, అంతరిక్ష పరిశోధనకూ అవసరమైన వ్యవస్థలనూ సమకూర్చిన నెహ్రూ నిస్సందేహంగా నవభారత నిర్మాత. స్వాతం త్య్రం సిద్ధించిన సమయంలో దేశ సమగ్రతనూ, సమైక్యతనూ పరిరక్షిస్తూ ప్రణాళికాబద్ధమైన ప్రగతి సాధించేందుకు అవసరమని భావించిన ఆర్థిక విధా నాలు అమలు చేశాడు. వాటిని ప్రజలు ఆమోదించారు. అనంతరం సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలింది. సోవియట్ యూనియన్ పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. నెహ్రూ నిర్మించిన అలీనోద్యమం అప్రస్తుతమైపోయింది.

ఆర్థిక సంస్కరణలు అమలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. రాజకీయాలలో రెండు భావజాలాలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు నాయకత్వ స్థానంలో నిలిచాయి. అదే రకమైన భావజాలాల ప్రాతిపదికగా సమాజంలోనూ సమీకరణాలు జరుగుతు న్నాయి. ఇవి మర్యాదకు లోబడి, చర్చకు పరిమితమైనంత కాలం ప్రమాదం లేదు. అమెరికాలో డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య, బ్రిటన్‌లో లేబర్, కన్స ర్వేటివ్ పార్టీలకూ మధ్య అనేక అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉన్నట్టే ఇండి యాలో కూడా అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అది ఆరోగ్య లక్షణమే. కానీ షారుఖ్ ఖాన్‌ని పాకిస్తాన్‌కు వెళ్ళిపొమ్మనడం, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌తో పోల్చ డం దారుణమైన తీవ్రవాద వైఖరులే. నెహ్రూ స్వప్నించిన భారత్‌ను ఛిద్రం చేసేవే. నెహ్రూకు నివాళి అర్పించవలసిన పద్ధతి ఇది కాదు.

కె.రామచంద్రమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement