విమర్శ, సమీక్ష వేరువేరా?

విమర్శ, సమీక్ష వేరువేరా?


అభిప్రాయం

‘సమీక్ష వేరు, విమర్శ వేరూనా?’ అని ఈ మధ్య ఓ యువపాఠకుడు అడిగాడు. అతను అప్పుడప్పుడూ సాహిత్యం గురించి ఏవేవో అడుగుతుంటాడు. అడిగేవన్నీ అమాయకమైనవీ, విసుగు కలిగించేవీ అయినా, తెలుసుకోవాలన్న అతని ఆసక్తిని (అదీ సాహిత్యం గురించి) గాయపర్చకూడదని తెలిసిందీ, తోచిందీ చెబుతుంటాను. ఈ సారి అతను అడిగింది అంత అమాయకమైంది కాదనిపించింది. ఎందుకంటే కొంతమంది అవి రెండూ వేరువేరని అనడం నేనూ విన్నాను. అందులో రచయితలూ, సమీక్షకులూ ఉండటం విశేషం. అమాటే ఎవరో ఎక్కడో అనగా, ఇతనూ వినివుంటాడు. ఒక్క మాటలో అతనికి సమాధానం చెప్పాను. ఆ మాటనే ఇంకొంచెం పొడిగిస్తే రచయితలకు కాకపోయినా, ఇతనిలాంటి యువపాఠకులొకరిద్దరికైనా పనికిరావచ్చు గదా అని ఈ చిన్న వ్యాసం. ఇది నా ఆలోచనే కానీ, నిర్ణయం కాదని విజ్ఞులైన పాఠకులకు మనవి.



విమర్శ వేరూ, సమీక్ష వేరూ అని ఎందుకు అనుకుంటున్నట్టు? విమర్శ అంటే విస్తృతంగానూ, సమీక్ష అంటే సంక్షిప్తంగానూ వుండాలనుకుంటున్నట్టా? లేక, కొలతల రీత్యా కాక స్వభావ రీత్యానే ఆ రెండింటికీ తేడా వుందనుకుంటున్నట్టా? కొలత రీత్యా చూస్తే తేడా వుండి, వుండాలి. అది ‘తప్పనిసరి తేడా’. సమీక్ష అనేది ప్రధానంగా పత్రికల సౌకర్యం కోసం పుట్టిన ప్రక్రియ. విమర్శలాగా సాహిత్యంతోపాటు పుట్టిన సహజ ప్రక్రియ కాదు. విమర్శ అనేది ఇప్పుడు దాదాపు అంతరించిన ప్రక్రియ. ‘డాక్టర్‌’ పట్టాల కోసం చేసే పరిశోధన విమర్శ కాదు. సాహిత్యం ఇప్పుడు పత్రికల మీద ఆధారపడి బతుకుతున్నది కనుక, పత్రికల్లో స్థలం ఖరీదైనది కనుక, వాటి కష్టనష్టాలను గమనంలో వుంచుకోక తప్పదు. కనుక క్లుప్తత అనివార్యం.



అయితే స్వభావ రీత్యా విమర్శకూ, సమీక్షకూ తేడా ఎందుకుండాలి? రెండూ సాహిత్యం గురించినవే కదా? బిందెడు నీటిలోనూ, బిందువు లోనూ నీటి గుణం ఒకటే కదా? ఈ ఉదాహరణనే సాహిత్య పరమైన పోలికతో చెప్పాలంటే, విమర్శ నవల లాంటిదైతే, సమీక్ష కథ లాంటిదనాలి.



నవల కంటే కథ రాయడం కష్టమని అనుభజ్ఞులు అంటున్నదే. అపరిమిత స్వేచ్ఛలో చెప్పడం కంటే పరిమిత స్వేచ్ఛలో చెప్పడానికి మరింత నైపుణ్యం వుండాలన్నది అందులో వున్న అర్థం. ఆ రీత్యా సమీక్ష ఇంకా నిర్దిష్టంగా వుండాలి. అయితే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది నైపుణ్యం గురించి కాదు. విమర్శ, సమీక్ష వేరు వేరు అనడం గురించి. అంటే వాటి స్వరూప, స్వభావాల్లో కూడా తేడా వుండాలి అనడం గురించి. స్వరూపంలో తేడా వుండటం గురించి చెప్పుకున్నాం.



స్వభావంలోనూ తేడా ఎందుకుండాలి?

సమీక్ష పత్రికల సౌకర్యార్థం పుట్టిన ప్రక్రియ అన్నాను. దానికి అది రచయితలకూ ఒకరకంగా సౌకర్యంగానే వుందన్నమాటనూ చేర్చాలి. ప్రస్తుతం రచయితలూ, కవులూ విమర్శను సహించగలిగే (సహేతుకమైనా) స్థితిలో లేరు. అలాగే విమర్శకు అవసరమైన ఓపికా, తీరికా, జ్ఞానమూ సమీక్షకు అవసరం లేదు. సమీక్షకులకు అవి లేవనడం లేదు. సమీక్షకు అవసరం లేదనే అంటున్నది. పుస్తకాలు చదివే అలవాటే తగ్గుతున్న పరిస్థితిలో సుదీర్ఘమైన విమర్శ చదివే ఓపిక అసలేవుండదు. అందువల్ల, నవలలు అరుదై, కథలు వున్నట్టు విమర్శ పోయి సమీక్ష వుంది. ఇది ఇప్పటి సాహిత్య, సామాజిక పరిస్థితికి అనుగుణంగా వుంది. దీన్ని సూచిస్తున్నదే విమర్శ వేరు, సమీక్ష వేరు అన్న అభిప్రాయం. అది కాకపోతే, ‘సమీక్ష’ అనడంలోనూ సమీక్షించడం అన్న అర్థం ద్వారా ఎంతో కొంత విమర్శను సూచిస్తున్నప్పటికీ, అవి రెండూ వేరువేరు అనడంలో, వేరే అర్థముందా?

-పి.రామకృష్ణ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top