2014: విజయాలు.. వివాదాలు

2014: విజయాలు.. వివాదాలు


కాలగర్భంలో మరో సంవత్సరం కలసిపోతోంది. తీపి, చేదు జ్ఞపకాలతో 2014కు వీడ్కోలు చెబుతున్న భారత క్రీడారంగం.. ఎన్నో ఆశలతో 2015కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా యవనికపై మనోళ్లకు చిరస్మరణీయ రికార్డులు, వివాదాలు, పరాజయాలు.. ఇలా మిశ్రమ అనుభూతులు ఎదురయ్యాయి. అలాగే క్రీడా ప్రపంచానికి కొన్ని విషాదకర ఘటనలు పీడకలల్ని మిగిల్చాయి. 2014లో మరచిపోలేని జ్ఞాపకాలు కొన్ని..



క్రికెట్: భారత క్రికెట్ జట్టుకు 2014 మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టెస్టు క్రికెట్లో ముఖ్యంగా విదేశీ గడ్డపై పరాజయాలు.. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో పేలవ ప్రదర్శన అభిమానులకు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. దీనికితోడు ఐపీఎల్ వివాదం, జడేజా-అండర్సన్,  కోహ్లి-ధావన్ల మధ్య గొడవలు మచ్చ తెచ్చాయి.



రోహిత్ వండర్: యువ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వీరోచిత ప్రపంచ రికార్డు సృష్టించడం భారత క్రికెట్కు ఊరట కలిగించే విషయం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో వన్డేలో రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు.



ధోనీ ప్రపంచ రికార్డు: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన కీపర్గా ధోనీ (134) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ధోనీ ఈ ఘనత సాధించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు సంగక్కర (133) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ధోనీ టెస్టుల్లో 38, వన్డేల్లో 85, టి-20ల్లో 11 స్టంప్ అవుట్లు చేశాడు.



విరాట్-అనుష్క లవ్వాట: భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. విరాట్తో తన అనుబంధాన్ని ఇటీవల అంగీకరించిన అనుష్క.. పెళ్లి విషయం మాత్రం తగిన సమయంలో చెబుతానంటూ  సస్పెన్షన్లో ఉంచింది. విరాట్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా అనుష్క కూడా ప్రియుడి చెంతకు చేరింది. ఈ ప్రేమ జంట కొత్త సంవత్సర వేడుకలను ఆస్ట్రేలియాలో జరుపుకోనుంది.



అండర్సన్ ఫాస్టెస్ట్ సెంచరీ:  న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. క్వీన్స్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 12 సిక్సర్లతో శతకం బాది షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును (37 బంతుల్లో 100) బద్దలు కొట్టాడు.



సిడ్నీ విషాదం: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ ఆకస్మిక మరణం..  ప్రపంచ క్రికెట్కు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల హ్యూస్ మృతి చెందడం క్రీడాభిమానులను కలచివేసింది.



బ్యాడ్మింటన్ వెరీ గుడ్:



అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ అద్భుత విజయాలు సాధించింది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సహా సింధు, శ్రీకాంత్, కశ్యప్ తదితరులు సత్తాచాటారు. గతేడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జనవరిలో ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్తో టైటిల్ వేట ఆరంభించిన సైనా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ ప్రీమియర్ టైటిళ్లను సాధించింది. మరో తెలుగుతేజం పీవీ సింధ ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో సింధు కాంస్య పతకాన్ని నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరెన్నో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంది. ఇక యువతార కిడాంబి శ్రీకాంత్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో శ్రీకాంత్ విజేతగా నిలిచాడు.  ఈ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. మరో భారత అగ్రశ్రేణి ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.



మెరిసిన సానియా: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త శిఖరాలను అధిరోహించింది. నమ్మశక్యంకాని విజయాలు సాధించి పూర్వ వైభవం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హొరియా టెకావ్ (రుమేనియా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఇక ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది.



హాకీ:  జాతీయ క్రీడకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మరోసారి రజతం నెగ్గింది. ప్రపంచకప్‌లో నిరాశపరిచినా... చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో స్థానాన్ని సంపాదించింది.



సరితపై వేటు:  ఈ ఏడాది భారత బాక్సింగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆసియా క్రీడల్లో మేరీకోమ్ (51 కేజీలు) స్వర్ణం సాధించగా... ఇవే క్రీడల్లో సెమీఫైనల్ ఫలితంపై నిరసన వ్యక్తం చేస్తూ సరితా (60 కేజీలు) కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. సరితపై ఏడాదిపాటు నిషేధం విధించారు.



షూటర్ల గురి కుదిరింది



 భారత షూటర్ జీతూ రాయ్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ప్రపంచకప్‌లో మూడు పతకాలు సాధించిన ఈ ఆర్మీ షూటర్ ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా క్రీడల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి 2016 రియో ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. స్టార్ షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించాడు. గగన్ నారంగ్, ప్రకాశ్ నంజప్ప, సంజీవ్ రాజ్‌పుత్... మహిళా షూటర్లు రాహీ సర్నోబాత్, అయోనిక పాల్, అపూర్వీ చందేలా, మలైకా గోయల్ తదితరులు కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించారు.



  బిలియర్డ్స్, స్నూకర్



 పంకజ్ అద్వానీ తన ఖాతాలో 12వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. 12 ప్రపంచ టైటిల్స్‌లో నాలుగు ఈ ఏడాది సాధించడం విశేషం. బెంగళూరుకు చెందిన పంకజ్ ఈ సంవత్సరం టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్, వరల్డ్ టీమ్ బిలియర్డ్స్, వరల్డ్ సిక్స్-రెడ్ స్నూకర్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

 

 ఆనంద్కు మరో ఓటమి



 విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరోసారి కార్ల్‌సన్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. కాగా చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి కాంస్య పతకాన్ని నెగ్గి చరిత్ర సృష్టించింది. పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్, అధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబు సభ్యులుగా ఉన్నారు. కోనేరు హంపి దిలిజాన్, తాష్కెంట్‌లలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో విజేతగా నిలిచి ఓవరాల్‌గా రెండో స్థానాన్ని సంపాదించింది.

 

 రెజ్లింగ్ పట్టు చిక్కింది



 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మినహా... మిగతా అన్ని ఈవెంట్స్‌లో భారత రెజ్లర్లు పతకాల పట్టు పట్టారు. కామన్వెల్త్ గేమ్స్‌లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, అమిత్ కుమార్, వినేశ్ స్వర్ణ పతకాలను సాధించారు. ఆసియా క్రీడల్లోనూ యోగేశ్వర్ దత్ రాణించి పసిడి పతకం నెగ్గాడు. 1986 తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు.

 

కామన్వెల్త్లో ఐదో స్థానం:  స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలు సాధించి మొత్తం 64 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది.

 

ఆసియా గేమ్స్లో 8వ స్థానం:  దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం  57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top