వలసలు బాధించాయి.. | Sakshi
Sakshi News home page

వలసలు బాధించాయి..

Published Fri, Jan 4 2019 8:30 AM

Telangana Migration Peoples Problems In Gulf Countries - Sakshi

‘తెలంగాణ జిల్లాల నుంచి మొదటగా గుజరాత్, మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేసేవారు. ఆ తర్వాత గల్ఫ్‌ దేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావనతో వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది’ అని త్రిలోక్‌ చందన్‌గౌడ్‌ చెప్పారు. ఆయన ‘గల్ఫ్‌ వలస కార్మికుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు’ అంశంపై పరిశోధనలను చేసి  హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు. 2017లో ఈయన పరిశోధన ముగిసింది. గల్ఫ్‌ వలస కార్మికులపై పరిశోధనలను నిర్వహించిన తొలి రిసెర్చ్‌ స్కాలర్‌గా గుర్తింపు పొందిన త్రిలోక్‌ చందన్‌గౌడ్‌ అనుభవాలు ఆయన మాటల్లోనే...   – ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌ 

మా స్వస్థలం సంగారెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎంఏ సోషియాలజీ, ఎంఫిల్‌ చేశాను. పీహెచ్‌డీలో ఏ సామాజిక అంశం ఎంచుకోవాలనే విషయంలో కొంత ఆలోచించాను. అంతకుముందు ఉన్నత చదువులలో భాగంగా కొన్ని సదస్సులలో పాల్గొన్నాను. ఆ సెమినార్‌లలో గల్ఫ్‌ వలస కార్మికుల ఆంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ చర్చల సందర్భంగా కార్మికుల కష్టాలు తెలుసుకున్న నాకు కన్నీళ్లు వచ్చాయి. మా ప్రాంతంలో గల్ఫ్‌ వలసలు లేనప్పటికీ ఆ అంశంపై పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నా.

తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస ఎందుకు వెళ్తున్నారు, వలస కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగయ్యాయా అనే ఆంశంపై పరిశోధన చేయడం వల్ల వలస జీవులకు కొంతైనా ప్రయోజనం కలుగుతుందని భావించాను. అంతేకాక గల్ఫ్‌ వలసలపై ఇంత వరకు పరిశోధనలు జరగలేదు. నా ద్వారానే పరి శోధనలు మొదలు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా పరిశోధనలకు అనేక మంది ప్రోత్సాహాన్ని అందించారు.

పలు అంశాలపై పరిశోధన 
గల్ఫ్‌ కంటే ముందు అనేక మంది పొరుగు రాష్ట్రాల్లోని బట్టల మిల్లుల్లో ఉపాధి పొందడానికి వెళ్లేవారు. 1960–70 మధ్య కాలంలో వలసలు మొదలయ్యాయి. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల నుంచి మొదట సూరత్, గుజరాత్, భీవండి, ముంబై తదితర ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో పనిచేయడానికి కార్మికులు వలస వెళ్లేవారు. తెలంగాణలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయినా.. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావన, ఇతర కారణాల వల్ల వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది. అలాగే కరీంనగర్‌ జిల్లాలో నక్సల్స్‌ ప్రభావం అధికం కావడంతో గ్రామాల్లో యువకులను నక్సల్స్‌ అనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసే వారు.

దీంతో యువకులు పోలీసు దాడుల నుంచి తప్పించుకోవడానికి ముంబైకి.. అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు పయనమయ్యారు. అప్పట్లో గల్ఫ్‌ దేశాల్లో చమురు తవ్వకాలకు తోడు భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి కార్మికులు ఎంతో మంది అవసరం అయ్యారు. ముంబై కేంద్రంగా గల్ఫ్‌ దేశాలకు వలసలు మొదలయ్యాయి. చమురు తవ్వకాలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారికి గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువ వేతనం లభించడంతో వలసలు క్రమంగా పెరిగాయి. ఈ వలసలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశాను. నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి పురుషుల వలసలు ఎక్కువగా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహిళలు అరబ్‌షేక్‌ల ఇళ్లలో పనిచేయడానికి వెళ్తున్నారు.

ఈ అంశాలపై లోతుగా పరిశోధన చేశాను. గల్ఫ్‌ దేశాల్లో వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఆంశంపై అధ్యయనం చేశాను. రీసెర్చిలో భాగంగా ఆ దేశాల్లో పర్యటించి కార్మికులను కలుసుకున్నాను. కార్మికుల ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి, పనికి తగ్గ వేతనం, సామాజిక భద్రత తదితర అంశాలపై ఐదేళ్ల పాటు పరిశోధన నిర్వహించా. గల్ఫ్‌ వలసలపై పరిశోధనలు నిర్వహించిన అనుభవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహించిన సెమి నార్‌లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను.

తాజాగా 2018 మార్చిలో నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ప్రవాసీ సంక్షేమ వేదిక తరఫున హాజరయ్యాను. ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన ముసాయిదాపై నిర్వహించిన సెమినార్‌ లో పాల్గొని భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను వినిపించాను. అలాగే ఢిల్లీ, గుజ్‌రాత్, కేరళ, తమిళనాడు, మహా రాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వలస కార్మికుల అంశాలపై నిర్వహించిన సెమినార్‌లలో పాల్గొని వలస కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కార్మికుల పక్షాన డిమాండ్లను వినిపించాను.

పరిశోధనలు కొనసాగిస్తున్నా..

గల్ఫ్‌ వలస కార్మికుల ఆంశంపై పీహెచ్‌డీ పూర్తిచేసినా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టు డాక్టర్‌ ఫెల్లోషిప్‌ పొందుతున్నాను. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గల్ఫ్‌ వలస కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడే ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గల్ఫ్‌ వలస కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడానికి మా పరిశోధనలు దోహదపడతాయని ఆశిస్తున్నాం.

Advertisement
Advertisement