అష్టావధానం.. ఎంతో ఇష్టంగా! | Sakshi
Sakshi News home page

అష్టావధానం.. ఎంతో ఇష్టంగా!

Published Thu, Jan 17 2019 10:47 AM

New Priest Lalith Aditya Special Story - Sakshi

అమెరికా గడ్డపై పుట్టి పెరిగాడు.. పరాయి భాషలో విద్యాభ్యాసంచేస్తున్నాడు.. అయితేనేం, అమ్మభాషలో కమ్మగా అష్టావధానం చేస్తున్నాడు లలిత్‌ ఆదిత్య.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ యువకుడు బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం నిర్వహించాడు. అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా తన అష్టావధాన ప్రస్థానంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు.

సాక్షి, సిటీబ్యూరో :భారత గడ్డతో అనుబంధమున్న ఎవరైనా తమ కష్టకాలంలో, ఆపద సమయంలోఉన్నపళంగా తలుచుకొనే దైవం హనుమంతుడు. ఆ దైవమే తనను అష్టావధానం వైపు అడుగులు వేయించాడు. ఆయన ఆశీర్వాదం బలంతోనే అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నానని యువ అష్టావధాని లలిత్‌ ఆదిత్యపేర్కొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆయన అష్టావధానంలో పేరు ప్రఖ్యాతులుసంపాదించారు. బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానంనిర్వహించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.

నాలుగు నెలల పాటు శిక్షణ..
సరిగ్గా మూడేళ్ల క్రితం హనుమంతుడిని స్తుతిస్తూ నేను రాసిన ఆంజనేయస్వామి శతకం  అష్టావధానం వైపు అడుగులు వేయించింది. శతకంలోని  తప్పొప్పులు విశ్లేషించుకునేందుకు వెళ్లిన నన్ను ధూళిపాళ్ల మహదేవ రమణి గురువు వద్ద అష్టావధానంలో శిక్షణ పొందేలా  మార్చింది. ఇందులో నాలుగు నెలల పాటు శిక్షణ తీసుకున్నా.

గొప్ప అదృష్టం.. అవకాశం..
రవీంద్ర భారతి నా కలల స్వప్నం. ఈ వేదికపై ప్రదర్శన పూర్వజన్మ సుకృతంగా భావిస్తా.  ఆ అదృష్టాన్ని మాటల్లో వర్ణించలేను. పద్యాలు రాయడం, వేదం, సంగీతం వంటి వాటిపై పట్టు ఉండటంతో అష్టావధానం తేలికైంది. అమెరికాలో పలు అష్టావధాన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇటీవల రాజమండ్రి, విజయవాడల్లో నిర్వహించిన అష్టావధాన ప్రక్రియల్లో పాలుపంచుకున్నాను.  

భక్తి కావ్యం.. జీవిత లక్ష్యం  
ప్రస్తుతం నేను అమెరికాలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. కెరీర్‌లో ఎదగడానికి అష్టావధానం ఎంతగానో ఉపకరిస్తుంది. సృజనాత్మకత, ఏకాగ్రత రెండూ  పెరుగుతాయి. భవిష్యత్తులో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో స్థిరపడతా. భక్తిభావాన్ని పెంపొందించే మంచి కావ్యం రాయాలనేదినా జీవిత లక్ష్యం. . 

తెలుగు భాషలో ఆత్మీయత..
అమెరికాలోని పిల్లలకు బాల్యంలోనే సంప్రదాయ నృత్యాలు, సాహితీ పఠనం, వేదాలు నేర్పిస్తున్నారు. తెలుగుభాష ఉచ్చారణలో స్పష్టత మాత్రమే కాదు.ఆత్మీయత దాగి ఉంటుంది. రు. నాన్న మారుతీ శశిధర్, అమ్మ శైలజ నా బాల్యంలోనే భారతీయ సంస్కృతీసంప్రదాయాలను అలవర్చారు. తెలుగులో మాట్లాడమే కాదు, చిన్నతనంలోనే పద్యాలు చెప్పటం.. తిరిగి చెప్పించటం ఇలా కన్నవారి ప్రేరణతోనే అమ్మ భాషపై పట్టు సాధించాను. పుస్తకపఠనం, సంగీతం రెండింటితో సహవాసంతో స్వయంగా పద్యాలు రాసేంతగా ఎదిగాను.  ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పద్యాలు రాసి గురువుల ప్రశంసలు పొందాను. 

Advertisement
Advertisement