కసి ఉంటేనే రాణించగలం

medchal cricket team won the venkataswamy dwaraka tourney - Sakshi

హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌

ముగిసిన వెంకటస్వామి రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నీ

విజేత మేడ్చల్, రన్నరప్‌గా నిజామాబాద్‌

సాక్షి, నిజామాబాద్‌: కసి, పట్టుదల, శ్రమ ఉంటేనే క్రీడల్లో రాణించగలరని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వెంకటస్వామి స్మారక క్రికెట్‌ టోర్నీ గురువారం ముగిసింది. టోర్నీ విజేతగా మేడ్చల్‌ జట్టు నిలవగా, నిజామాబాద్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం వివేక్‌ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో ఆడితేనే విజయాలు సొంతమవుతాయన్నారు.

ప్రస్తుతం క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే క్రీడకు లేదని, క్రికెట్‌లో రాణించాలంటే కసి, పట్టుదల, శ్రమ అవసరమని చెప్పారు. పోటీ ఎంత ఎక్కువగా ఉన్నా క్రీడాకారుల క్రమశిక్షణే వారిని ఉన్నత శి«ఖారాల్లో నిలబెడుతుందన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ.. ఇష్టంతో ఆడితే ఏదైనా సాధించవచ్చన్నారు. నిజామాబాద్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రసేన్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, జాయింట్‌ కార్యదర్శి సురేష్‌బాబు, ఫయ్యుమ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు. 

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ 
గురువారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడడంతో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నిజామాబాద్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సత్యయాకీ 30 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మేడ్చల్‌ జట్టు 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

 

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top