
ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెడుతున్నారా.. అయితే జాగ్రత్త!
సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు పోస్టు చేయడం చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు పోస్టు చేయడం చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది. నిత్యం సెల్ఫీలతోపాటు ఆనందకరమైన అనుభూతులకు సంబంధించిన ఎన్నో ఫొటోలను ఈ మధ్య అమ్మాయిలు కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు. అయితే, వారి ఫొటోలను కొందరు నీచులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందమైన యువతుల ఫొటోలను కాపీ చేసుకొని.. మార్ఫింగ్ చేసి.. ఆన్‌లైన్ సెక్స్ చాటింగ్, పోర్నోగ్రఫీ (బూతు సినిమాల) ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే, ఈ నీచ గ్రూపుల ఆట కట్టించడానికి ఎథికల్ హ్యాకర్స్ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న చాలా అకౌంట్లకు ఎథికల్ హ్యాకర్స్ ఇప్పటికే చెక్ పెట్టారు.
సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు కాపీ చేయడమే కాదు.. ఈ కిరాతక మూకలు కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు తీసి.. వాటిని ఆన్‌లైన్‌లో తమ పోర్న్ సైట్ల కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు ఈ ఇలాంటి సైబర్ నేరాల బారిన పడినట్టు నిపుణులు వెల్లడించారు. 'ఆన్‌లైన్‌లో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలోని మహిళా యూజర్ల ఫొటోలు కాపీ చేసుకొని భద్ర పరుచుకుంటున్నారు. సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం అందమైన యువతుల ఫొటోలు వారు వాడుతున్నారు. ఇలాంటి పేజీలెన్నో సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్నాయి. అయినా పోలీసులు పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు' అని ఢిల్లీ, నోయిడా పోలీసులతో కలిసి పనిచేసిన ఓ సైబర్ నిపుణుడు తెలిపారు.
అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు మార్ఫింగ్ చేయడం లేదా ఒరిజినల్ చిత్రాలను వాడుకొని ఈ గ్రూపులు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. వీటిద్వారా పెయిడ్ పోర్న్ సైట్లలో యూజర్లు చేరేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను బెదరించి డబ్బు వసూలు చేయడం కూడా చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టే విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.