
ప్రపంచ బ్యాంక్‌తో ‘కొత్త జీవితం’
కాంచీపురం జిల్లా పడప్పై గ్రామంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది.
సాక్షి, చెన్నై: కాంచీపురం జిల్లా పడప్పై గ్రామంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది. అక్కడి గ్రామీణ ప్రజల స్థితిగతులు, జీవనాధారం, ప్రభుత్వ సహకారం గురించి ఈ బృందం ఆరా తీసింది. కొత్త జీవితం పథకం లబ్ధిదారులతో ముచ్చటించింది.పేద, వెనుకబడిన, గిరిజనుల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు నిధుల్ని కేటాయిస్తోంది. పుదు వాల్వు(కొత్తజీవితం)నినాదంతో ప్రత్యేక పథకాన్ని ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 32 జిల్లాల్లో వెనుకబడిన 120 మండలాల్లో 4,174 గ్రామాల్లో రూ.1670 కోట్లతో ఈ పథకం దిగ్విజయవంతంగా అమలవుతోంది. కాంచీపురం జిల్లా పడప్పైలోనూ ఈ పథకం లబ్ధిదారులెందరో ఉన్నారు. ఇక్క ట్రామ్ విదేశీ సంస్థ నేతృత్వంలో ఓ గార్మెంట్స్‌ను నెలకొల్పి యువతకు కొత్త జీవితాన్ని అందించారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ నేతృత్వంలో ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం పడప్పైలో పర్యటించింది.
పడప్పైలో భేష్: ప్రజా సంఘాలు, గ్రామ సమాఖ్యలు, స్వయంసహాయక బృందాల్లోని పేద వారికి తమ బ్యాంకు అందిస్తున్న సేవల్ని పడప్పైలో ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. ఇక్కడి మహిళ జీవితాల్లో వచ్చిన మార్పు లు, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీవనోపాధి, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు గురించి ఆరాతీశారు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్న జిమ్ యోంగ్ కిమ్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచ బ్యాంక్ వెబ్ సైట్‌లో పొందు పరచిన అంశాలు, ఆర్థిక బలోపేతానికి సలహాలు తెలుసుకోవాలని, వాటి ద్వారా మరింత ప్రగతి పథకంలో సాగాలని పిలుపు నిచ్చారు.
యువతకు అభినందన : అనంతరం అక్కడి ట్రామో విదేశీ సంస్థకు చెందిన గార్మెంట్స్‌ను పరిశీలించారు. అక్కడ కొత్త జీవితం పథకం ద్వారా ఉపాధి, శిక్షణ పొందుతున్న యువతను కలుసుకున్నారు. వారి జీవిత వివరాల్ని, స్థితి గతుల్ని ఆరా తీసినానంతరం ఆ పథకం ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలుసుకున్నారు. ఈ సంస్థలో 1200 మందిలో 674 మంది కొత్త జీవితం పథకం కింద ఉద్యోగాల్లోకి వచ్చినట్టు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఓలోరుల్డ్, సెర్ ఐటీవీఎస్, శోభా, సిలిక్ తదితరులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉదయ చంద్రన్, మైదిల్ రాజేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.