
'పిల్లల్ని కనడానికి మాత్రమే వాళ్లు'
సున్నీ వర్గానికి చెందిన ఓ మతగురువు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి.
తిరువనంతపురం : సున్నీ వర్గానికి చెందిన ఓ మతగురువు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. స్త్రీ, పురుష సమానత్వం అనేది ఇస్లామ్ కు సంబంధించిన అంశం కాదని అఖిల భారత సున్నీ జామియాతుల్ ఉలామా చీఫ్ కాంతపురం ఏపీ అబూబాకర్ ముస్లియర్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కేరళలోని కోజికోడ్లో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాదు.. వారు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే సరిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు మానసిక బలం ఉండదని, దేనినైనా నియంత్రించే శక్తి వారికి లేదన్నారు. ఇటువంటి విషయాలు మగవారిమే సాధ్యమని ముస్లియర్ చెప్పారు. స్త్రీ, పురుష సమానత్వం అనేది ఎప్పటికీ సాధ్యం కాదనేది వాస్తవమన్నారు. ఈ అంశం ఇస్లాం ఆచారానికి పూర్తిగా వ్యతిరేకమని.. పురుషులతో వారు ఎప్పుడు సమానులు కాదని పునరుద్ఘాటించారు. సంక్షోభ పరిస్థితుల్లో స్త్రీలు తట్టుకొని నిలబడలేరని సున్నీ చీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.