మరుగుదొడ్లు రెట్టింపు.. సదుపాయాలు శూన్యం

Will Modi's Govt Swachh Bharat Mission Meet Its Target? - Sakshi

స్వచ్ఛభారత్‌ ఎంత దూరం ?

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం

ఇంటింటికీ టాయిలెట్‌ సౌకర్యం అంశంలో సంఖ్యాపరంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. మహాత్మా గాంధీజీ కన్న కలలు నిజమయ్యేలా భారత్‌ను అద్దంలా తళతళలాడేలా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడున్నరేళ్ల క్రితం స్వయంగా చీపురు పట్టి రాజధాని వీధుల్ని తుడిచి మరీ ప్రకటించారు. బహిరంగ మల విసర్జనను పూర్తిగా  నిర్మూలించి అక్టోబర్‌ 2, 2019 గాంధీజీ 150వ జయంతిన స్వచ్ఛ భారత్‌తో ఘనంగా నివాళులర్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యసాధన దిశగా మెరుగైన ఫలితాల్ని సాధిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మొదలైన ఇన్నేళ్లలో నివాస గృహాలకు మరుగుదొడ్ల సదుపాయం  రెట్టింపైందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ  లోక్‌సభకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 

 2014 అక్టోబర్‌ 2 నాటికి దేశంలో 38.7 శాతం నివాసాలకు మాత్రమే టాయిలెట్‌ సౌకర్యం ఉంటే, 2018 మార్చి నాటికి  78.98శాతం నివాసాలకు ఈ సదుపాయం పెరిగింది. ఈ మూడున్నరేళ్లలో 6.4 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్‌) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య క్రమంగా  పెరుగుతూ వస్తోంది. 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఒడిఎఫ్‌ను సాధించాయి. 

ఒడిఎఫ్‌ రాష్ట్రాలు 
అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌
హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, కేరళ
మహారాష్ట్ర,  మేఘాలయా, సిక్కిం, ఉత్తరాఖండ్‌ 
కేంద్రపాలిత ప్రాంతాలు 
దాదా నాగర్‌ హవేలి, డయ్యూ డామన్‌ , చండీగఢ్‌

ఇక టాయిలెట్లు సదుపాయం ఘోరంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఒడిశా, జమ్ము కశ్మీర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్‌లో కేవలం 41 శాతం ఇళ్లకు మాత్రమే టాయిలెట్‌ సౌకర్యం ఉంటే, ఒడిశాలో 48 శాతం, కశ్మీర్‌లో 51శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సదుపాయం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. 

తెలంగాణలో దాదాపుగా  19 లక్షల టాయిలెట్స్‌ను నిర్మిస్తే ఒడిఎఫ్‌ రాష్ట్రాల జాబితాలో నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఆ లక్ష్యం చేరుకోవాలంటే 22 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 అక్టోబర్‌ 2 నాటికి దేశంలో 9 కోట్ల 80 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించాలన్నదే స్వచ్ఛ భారత్‌ లక్ష్యంగా పెట్టుకొని భారీగా నిధులు కూడా కేటాయించారు

సదుపాయాల సంగతేంటి? 
ఇంటింటికి టాయిలెట్స్‌ విషయంలో సంఖ్యాపరంగా రెట్టింపైనప్పటికీ సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల నీటి సదుపాయం లేక టాయిలెట్‌  ఉన్నప్పటికీ బహిర్భూములకే వెళుతున్నారు. మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, టాయిలెట్‌కి సరైన పద్ధతిలో ట్యాంకులు నిర్మించకుండా ఏదో ఒక గొయ్యిని తవ్వడం వల్ల దానిని వినియోగించుకోలేకపోతున్నారు. నాలుగు గోడలు కట్టేసి పైపు లైన్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా టాయిలెట్లను వినియోగించుకోలేని పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గోపాల్‌పుర గ్రామంలో 330 ఇళ్లకు గాను 100 టాయిలెట్స్‌ను కట్టించారు. కానీ వారిలో ఒక్కరు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. దీనికి  నీటి వసతి లేకపోవడం, నాసిరకం నిర్మాణాలే కారణం.. కొంతమంది ఆ టాయిలెట్స్‌ని గోడౌన్‌లుగా ఉపయోగిస్తున్నారు.  ఇలాగైతే కోట్లలో అంకెలే కనిపిస్తాయి తప్ప అసలు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top