రాష్టప్రతి పాలన ఉండదు

రాష్టప్రతి పాలన ఉండదు - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించే ఆలోచన లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం ఉందని, అందువల్ల రాష్టప్రతి పాలన విధించే ప్రసక్తే లేదన్నారు. అయితే, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్న సీమాంధ్రలో శాంతి, భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డిపై ఉందని చెప్పారు. ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ విజయనగరంలో పీసీసీ అధƒ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన ఆస్తులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు.


 


సమైక్యాంధ్ర ఉద్యమంలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా ఆందోళనలు జరుగుతున్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శాంతి, భద్రతలను కాపాడడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ తీర్మానాన్ని, ముసాయిదా బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపిస్తామని స్పష్టంచేశారు. విభజనతో ముడిపడి ఉన్న వివిధ అంశాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమర్పించే నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత రాష్టప్రతి ద్వారా రాష్ట్ర శాసనసభకు పంపుతారని వివరించారు.


 


ఈ విషయంలో శాసనసభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని, ప్రజలు, ఎన్జీవోలే కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవాన్ని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. విభజన అనంతర ప్రయోజనాల విషయంపై పోరాడాలన్నారు. 2004లో, 2009లో తమకు అధికారం అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు. హైదరాబాద్‌లో, తెలంగాణ ప్రాంతంలో నివసించే వారందరూ ఆ ప్రాంత ప్రజలేనని, వారికన్ని హక్కులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని, ఆ సమయంలో గవర్నర్‌ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలిస్తుందని చెప్పారు. కేంద్ర పాలితప్రాంతంగా మాత్రం చేయబోమన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top