వైస్‌చాన్సలర్ల నియామకం సబబే | The state Supreme Court upheld the government's decision | Sakshi
Sakshi News home page

వైస్‌చాన్సలర్ల నియామకం సబబే

Aug 30 2016 2:47 AM | Updated on Nov 9 2018 5:56 PM

వైస్‌చాన్సలర్ల నియామకం సబబే - Sakshi

వైస్‌చాన్సలర్ల నియామకం సబబే

వైస్‌చాన్సలర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
 
 సాక్షి, న్యూఢిల్లీ: వైస్‌చాన్సలర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీసీల నియామకంపై రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొం దించిన మార్గదర్శకాలను సవరించుకుని వీసీలను నియమించే అధికారం తమకుందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో సుప్రీం ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 8 వర్సిటీలకు వీసీలను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ఉమ్మడి హైకోర్టు, ఆ నియామకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది, భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, తమిళనాడులోని మదురై వర్సిటీకి సంబంధించిన వి.కల్యాణి మదివణ్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం యూజీసీ మార్గదర్శకాలను సవరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. చాన్సలర్ల నియామకంలో సైతం రాష్ట్రానికి ఆ అధికారముందని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీ మార్గదర్శకాల్లో ఏ మార్పు చేయలేదని, ఆయా కమిటీలు చేసిన సిఫారసుల మేరకే నియమించిందని వాదించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అమలు చేయవచ్చని పేర్కొంది. అయితే చాన్సలర్‌గా ఉండే గవర్నర్ స్థానంలో ఇతరులను నియమించుకునే అధికారానికి సంబంధించిన అంశంపై ఇతర వర్సిటీల స్పందనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. దీనికై ప్రతివాది మోహన్‌రావు సహా పలు వర్సిటీలకు నోటీసులు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement