కాల్‌ సెంటర్‌ కేసులో కొత్తకోణం?

కాల్‌ సెంటర్‌ కేసులో ఐపీఎస్‌ కొడుకు? - Sakshi


ముంబై: అమెరికా రెవెన్యూ అధికారులుగా మాట్లాడుతూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్న థానే ‘కాల్‌సెంటర్‌ రాకెట్‌’కు సంబంధించిన విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ రాకెట్‌ వెనక గుజరాత్‌కు చెందిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమారుడి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  మిరా రోడ్‌లో అక్రమంగా నడుపుతున్న ఏడు కాల్‌ సెంటర్లపై ఈ నెల తొలి వారంలో క్రైం బ్రాంచి పోలీసులు దాడి చేసి 70 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో 630మందిపై ఐపీసీ సెక్షన్ 384, 419,429 కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఐటీ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.



కాగా ఈ కేసుకు సంబంధించి ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో కాల్‌ సెంటర్లను ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొడుకు నడిపిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు అందించినట్లు చెప్పారు. అరెస్టయిన వారిని విచారించగా.. 2009 నుంచి ప్రహ్లాద్‌ నగర్‌లో అక్రమంగా కాల్‌సెంటర్లు నడిపిస్తున్నట్లు వెల్లడించారన్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి అహ్మదాబాద్‌లోని మరో 5 కాల్‌ సెంటర్లపై ఇటీవల పోలీసులు దాడి చేశారు.



అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ అనే యువకుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షాగీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కాల్ సెంటర్ రాకెట్ మాస్టర్ మైండ్ జగదీశ్ని పోలీసులు గతరాత్రి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top