బర్త్‌డే వేడుకల్లో స్వామి చిన్మయానంద

Swami Chinmayananda Celebrates His Birthday After Bail - Sakshi

లక్నో: లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ మంగళవారం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం షాజహాన్‌పూర్‌లోని ముముస్కు ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వందలాది మంది ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ మందిరానికి పాటుపడ్డవారిపై ఆయన ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో శ్రీరాములవారి గుడి నిర్మాణం కోసం పాటుపడ్డవారందరినీ యోధులుగా అభివర్ణించారు. వారివల్లే నేడు ఆలయ నిర్మాణం కల సాకారమవుతోందన్నారు. మంగళవారం సాయంత్రం రామాయణంలోని సుందరకాండ అధ్యాయాన్ని పారాయణంతో బర్త్‌డే వేడుకలు ప్రారంభించినట్లు ఆశ్రమ అధికారులు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు ప్రత్యేక ప్రసాదాలు అందజేశామన్నారు. మరోవైపు చిన్మయానందకు బెయిల్‌ ఇవ్వడంపై వచ్చిన అభ్యంతరాలను బుధవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. (రేప్‌ కేసులో చిన్మయానంద అరెస్ట్‌)

ఇద్దరి అరెస్టు, బాధితురాలి విడుదల
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో లా కాలేజీలో అడ్మిషన్‌ రావడానికి సహకరించిన చిన్మయానంద్‌.. తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. అంతేకాక పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనతో మసాజ్ చేయించుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో సిట్‌బృందం సెప్టెంబర్‌ 20న చిన్మయానందను అరెస్టు చేసింది. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేరకు సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్ట్‌ చేయగా డిసెంబర్‌ 4న విడుదల చేశారు. (చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్‌.. విద్యార్థిని అరెస్ట్‌)

చదవండి: ‘సిట్‌ ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తోంది!’

(స్వామి చిన్మయానంద్‌కు బెయిల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top