కేంద్రం వైఖరిలో పొంతనలేదు: సుప్రీం కోర్టు | Supreme Court slams government for double-speak on coal blocks | Sakshi
Sakshi News home page

కేంద్రం వైఖరిలో పొంతనలేదు: సుప్రీం కోర్టు

Sep 25 2013 5:14 AM | Updated on Sep 1 2017 11:00 PM

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో అయోమయానికి గురైన అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి.. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వటం చాలా కష్టమని, ఎంతో శ్రమతో కూడుకున్న పనని కోర్టుకు నివేదించారు.

న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో అయోమయానికి గురైన అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి.. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వటం చాలా కష్టమని, ఎంతో శ్రమతో కూడుకున్న పనని కోర్టుకు నివేదించారు. మంగళవారం విచారణ మొదలవుతుండగానే.. కేంద్రం గతంలో తెలిపిన వైఖరికి భిన్నమైన వైఖరిని ఇప్పుడు చెప్తోందంటూ ధర్మాసనం తప్పుపట్టింది. ‘నిన్న సమర్పించిన అఫిడవిట్ గతంలో మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉంది.
 
 చాలా అంశాలపై ఈ అఫిడవిట్ మౌనం దాల్చింది. లేదంటే మరేదో చెప్తోంది. మీరు ఒక వాదన వినిపించారు. కానీ ఈ పత్రాలు మరేదో చెప్తున్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టబద్ధతను మీరు సమర్థించుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన వివరాలు కావాలని, ఒక్కో క్షేత్రం వారీగా వివరించాలని అటార్నీ జనరల్‌కు చెప్పింది. జస్టిస్ ఆర్.ఎం.లోథా నేతృత్వంలోని జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం.. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన తాజాగా ప్రశ్నల వర్షం కురిపించింది.
 
 తాను ఇచ్చిన సమాధానాలతో ధర్మాసనం సంతృప్తి చెందకపోవటంతో.. మృదుప్రవర్తన గలవాడిగా పేరున్న వాహనవతి ప్రశ్నల శరపరంపరతో అయోమయానికి, అసహనానికి లోనయ్యారు. ‘ప్రతిదీ నా మెదడులో తీసుకురాలేను. అది చాలా కష్టం. ఎంతో శ్రమతో కూడుకున్న పని. నేను ఒక కోణం గురించి వాదించిన తర్వాత, మరో కోణంపై మరో ప్రశ్న తలెత్తుతుంది. నేను ముందుకెలా వెళ్లగలను? బొగ్గు క్షేత్రం గుర్తింపు గురించి నేను సమాధానం ఇచ్చా. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ గురించి సమాధానం చెప్పా. ఇప్పుడేమో బొగ్గు క్షేత్రం ఎక్కడుందనే దాని గురించి ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. కేటాయింపులకు సంబంధించిన రికార్డులు మొత్తం సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని, ఇప్పటివరకూ విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు చెప్పే దాన్ని మేం ఎలాంటి ప్రశ్నలు అడగకుండా విని, మా తీర్పు ఇవ్వాలి.. లేదా మేం ప్రశ్నలు వేయాలి. మేం ప్రశ్నలు అడిగితే మీరు ఆశ్చర్యపోతున్నారు. మేం ఏం చేయాలి?’ అని వ్యాఖ్యానించింది. విచారణ వాయిదా వేయటానికి నిరాకరించింది.

Advertisement

పోల్

Advertisement