పప్పుల ధరలకు కళ్లెం! | Stop to the price of pulses | Sakshi
Sakshi News home page

పప్పుల ధరలకు కళ్లెం!

Jun 16 2016 1:06 AM | Updated on Jun 4 2019 5:04 PM

పప్పుల ధరలకు కళ్లెం! - Sakshi

పప్పుల ధరలకు కళ్లెం!

ఆకాశాన్నంటిన పప్పుధాన్యాల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి
 
బఫర్ నిల్వలు పెంచాలని కేంద్రం నిర్ణయం
జైట్లీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం
జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ధరల సమస్యకు పరిష్కారం
ధరల అదుపులో రాష్ట్రాలకూ సమాన బాధ్యత: పాశ్వాన్
 
 న్యూఢిల్లీ: ఆకాశాన్నంటిన పప్పుధాన్యాల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేజీకి రూ.170 వరకు పలుకుతున్న పప్పుల రేట్లను అదుపులోకి తేవడానికి ఉన్నతస్థాయిలో సమావేశమై పరిష్కార మార్గాలపై చర్చించింది. దీనికోసం పప్పుధాన్యాలను ఆఫ్రికా, మయన్మార్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోపాటు బఫర్ నిల్వలను పెంచాలని నిర్ణయించింది. ధరల మంటలపై కేంద్రంపై ముప్పేట దాడి నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ... నిత్యావసరాల ధరల నియంత్రణలో రాష్ట్రాలకూ సమాన బాధ్యత ఉందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో పాశ్వాన్‌తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

‘కేజీ రూ.170కి ఎగబాకిన పప్పులు, రూ.100కు చేరిన టమోటాలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ధరల పెరుగుదలకు కారణాలను, వాటిని అదుపులోకి తేవడానికి గల ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 70 లక్షల టన్నుల డిమాండ్ మేరకు సరఫరాలేదన్నారు.  రాష్ట్రాల నుంచి డిమాండ్లు వచ్చినప్పుడు బఫర్ స్టాక్ నుంచి ఎక్కువ నిల్వలు విడుదల చేయడంతోపాటు మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలపై చర్చించారు. ‘ధరల కట్టడి కోసం మరిన్ని బఫర్ నిల్వలు పెంచాలని మా శాఖకు చెప్పారు. ఈ ఏడాది బఫర్ స్టాక్‌ను 1.5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే ఖరీఫ్, రబీ సీజన్లలో 1.15 లక్షల టన్నులను కొన్నాం. రబీ సేకరణ ఇంకా కొనసాగుతోంది’ అని పాశ్వాన్ తెలిపారు. పప్పుధాన్యాలు ఎక్కువగా పండించే మయన్మార్, ఆఫ్రికా లాంటి దేశాలకు వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారని, ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి దిగుమతి చేసే మార్గాలపై అన్వేషిస్తారని తెలిపారు. ముడి కంది, మినప్పప్పులను బఫర్ నుంచి రూ. 66కు కొని వినియోగదారులకు రిటైల్‌గా పప్పును రూ.120కి మించకుండా సరఫరా చేయాలని రాష్ట్రాలకు చెప్పామన్నారు. రాష్ట్రాలు బఫర్ పెంచుకోవడంలో ఆసక్తిచూపడం లేదని ఆరోపించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదంతోపాటు జాతీయ వ్యవసాయ ఉమ్మడి మార్కెట్ కార్యరూపంలోకి వస్తే ధరల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.  

 లోటును అధిగమించి దేశంలో సరఫరా పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా దిగుమతి చేసుకుంటామని జైట్లీ చెప్పారు. సేకరణను, సాగును పెంచే అంశాలతోపాటు అక్రమ నిల్వదారులపై చర్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. ప్రైవేటు దిగుమతిదారుల కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచే అంశాన్నీ చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం బఫర్ నుంచి 10వేల టన్నుల పప్పుధాన్యాలను ఇప్పటికే విడుదల చేసింది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) మొబైల్ వ్యాన్ల ద్వారా కందిపప్పు, మినప్పప్పును కేజీ రూ.120కి విక్రయించే కార్యక్రమాన్ని పాశ్వాన్ ఢిల్లీలో ప్రారంభించారు. కేంద్రీయ భండార్, సఫల్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కందిపప్పు, మినప్పప్పును కేజీ రూ.120కి విక్రయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక సలహాదారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement