కాటేసిన పాము తలను కరకరా నమిలేశాడు! | in a shocking incident UP man eats snakes head | Sakshi
Sakshi News home page

కాటేసిన పాము తలను కరకరా నమిలేశాడు!

Feb 21 2018 8:56 AM | Updated on Aug 20 2018 7:28 PM

in a shocking incident UP man eats snakes head - Sakshi

పాము తలను తిని స్పృహతప్పి పడిపోయిన సోనేలాల్‌

లక్నో : పాము కాటేస్తే ఎవరైనాసరే కంగారుతో ఆస్పత్రికి పరుగులు తీస్తారు, ఆస్పత్రి లేనిచోట ఆకుమందులు మింగుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం కోపంతో రగిలిపోయాడు. ‘నన్నే కాటేస్తావే..’ అంటూ పామును దొరకబుచ్చుకుని దాని తలను కొరికి కరకరా నమిలేశాడు! ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

శుక్లాపూర్‌భగర్‌ గ్రామానికి చెందిన సోనేలాల్‌ అనే రైతు మొన్న ఆదివారం పొలం పనులు చేసుకుంటుండగా కాలికి ఏదో కుట్టినట్లనిపించింది. చూస్తే పక్కనే పాము కనిపించింది. అంతే, మనోడి కోపం నషాళానికెక్కింది. ఒక్క అంగలో పామును దొరకబట్టి తలను కొరికి నమిలి మింగేశాడు. పాము తలను తిన్న కొద్ది సేపటికే అతను స్పృహతప్పి పడిపోయాడు. అటుగా వచ్చిన గ్రామస్తులు.. 108కు ఫోన్‌చేసి సోనేలాల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు.

పాము కుట్టనేలేదట! : సోనేలాల్‌ను క్షుణ్నంగా పరీక్షచేసి అసలతన్ని పాము కుట్టలేదని డాక్టర్లు తేల్చారు. ‘‘పాము తలను తినడం వల్ల ఆ విషప్రభావానికి స్పృహకోల్పోయాడు. ఒంటిపై పాముకాటు గాయాలేవీ లేవు. అతని రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో ప్రాణాపాయం తలెత్తలేదు. ముందుజాగ్రత్తగా యాంటీవెనం ఇంజెక్షన్‌ ఇచ్చాం’’ అని సోనేలాల్‌కు చికిత్స అందించిన డాక్టర్‌ మహేంద్ర వర్మ తెలిపారు. కొన్ని గంటల్లోనే సోనేలాల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement