
భారీ వర్షాలు ఉత్తరాదిని ముంచెత్తాయి. వరద తాకిడికి యూపీలో కేవలం నాలుగు రోజుల్లో 73 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వరద తాకిడికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 73 మంది మరణించారు. తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాగరాజ్, వారణాసి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవడంతో సాధారణ జనజీవనానికి విఘాతం కలిగింది. కుండపోతతో లక్నో, అమేధి, హర్దోయ్ సహా పలు జిల్లాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ర్టేట్‌లను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. మరోవైపు బిహార్‌లోనూ వరద ఉధృతితో 15 జిల్లాల్లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లోనూ గత రెండు రోజులుగా వరద తాకిడితో ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు.