సెక్షన్‌-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ

Section 377 in SC, Bench Rejects Centre Plea to Defer Hearing - Sakshi

న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్‌-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది.  దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్‌-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే  ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, వైవీ చంద్రచూడ్‌, ఎఎమ్‌ కన్వీల్కర్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి(మాజీ అటార్నీ జనరల్‌) వాదనలు వినిపించారు. లంచ్‌ విరామం అనంతరం తిరిగి విచారణ కొనసాగనుంది.

ఐపీసీ సెక్షన్‌ 377... ఈ సెక్షన్‌ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్‌ కింద 'అసహజమైన నేరాల' (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. 

150 ఏళ్లకు పైగా..  1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్‌ ఫౌండేషన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్‌ ‘నేరం కాదని’ తేల్చింది.  రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్‌ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది.

అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది.  దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు లేవనెత్తుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top