మన మూలాలు ఎక్కడ ?

Scientists Search for on Our Civilization - Sakshi

అన్వేషణలో కొత్త కోణాలు...

సాక్షి, హైదరాబాద్‌ : భారత ఉప ఖండం చరిత్రకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలతో పాటు, భారతీయ నాగరికతపై చేసిన వివిధ  సూత్రీకరణలపై చర్చకు సమాధానాలు కనుక్కునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92 మంది శాస్త్రజ్ఞులు రూపొందించిన ‘ ఓ నూతన పత్రం’  దీనికి మార్గం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే   ‘ది జెనోమిక్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియా’ శీర్షికతో  ఆన్‌లైన్‌లో పోస్టయిన ఈ పత్రంలో జన్యుశాస్త్రం మొదలుకుని ఉప ఖండంలో ప్రాచీన నివాసితుల వంశ పారంపర్య వివరాల వరకు పరిశీలించారు. 

అన్ని ప్రతిష్టాత్మక సంస్థలే...
మనదేశ నాగరికతపై కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఉపకరించే ఈ పత్రాన్ని తయారు చేయడంలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ మొదలుకుని హార్వర్డ్, ఎంఐటీ, ద రష్యన్‌ అకాడమి ఆఫ్‌ సైన్సెస్, ద బీర్బల్‌ సహాని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియో సైన్సెన్‌ (లక్నో), ద దక్కన్‌ కాలేజీ, ద మాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్, ద ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఆర్కియాలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఉజ్బెకిస్తాన్‌... ఇలా 92  ప్రపంచప్రసిద్ధి పొందిన శాస్త్ర,సాంకేతిక, పరిశోధన సంస్థలకు చెందిన వారు భాగస్వాములయ్యారు. ఈ అధ్యయనానికి సహ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో జన్యుశాస్త్ర నిపుణుడు డేవిడ్‌ రీచ్‌ కూడా ఉన్నారు. 

అధ్యయనం ఇలా...
వందేళ్ల క్రితం నాటి ప్రజల డీఎన్‌ఏ శాంపిళ్లతో (612 మంది ప్రాచీన పౌరులు) జన్యువుల ఆధారంగా ఈ పరిశీలన నిర్వహించారు. ఇందులో దక్షిణాసియా మొదలుకుని తూర్పు ఇరాన్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తురాన్, తుర్కెమినిస్తాన్, తజికిస్తాన్, ఖజకిస్తాన్‌లకు చెందిన వారి నమూనాలున్నాయి. మొత్తం 612 జన్యువుల్లో 362  మంది డీఎన్‌ఏలను తొలిసారి పరీక్షించారు. ఈ జన్యువుల నుంచి తీసుకున్న డేటాను ప్రస్తుతం దక్షిణాసియాలోని 246 విలక్షణ గ్రూపులతో సహా పైన పేర్కొన్న ఆయా ప్రాంతాల వ్యక్తుల సమాచారంతో పోల్చి చూశారు. 

దేనికోసమీ పరిశోధన ?
మధ్య, దక్షిణాసియాలలో ప్రజలు ఎలా స్థిరపడ్డారు ? అన్న విషయంపై అంచనాకు వచ్చేందుకు తగిన స్థాయిలో పురాతన డీఎన్‌ఏతో పాటు పరిశీలన కొరవడింది. దీనికి సంబంధించి అనేక సూత్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని దక్షిణాసియాలోని రాజకీయాలతో ముడిపెట్టి చేసినవీ ఉన్నాయి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా నీలికళ్ల శ్వేతజాతీయులు గుర్రాలపై ఉపఖండానికి వచ్చి తమకు ఎదురైనా ప్రతీ దేశంపై విజయం సాధించారన్నది వీటిలో భాగంగా ఉన్నాయి.  దీనికి పూర్తి విరుద్ధ వాదననను హిందుత్వవాదులు తీసుకొచ్చారు. భారత–ఐరోపా భాషలన్నీ భారత్‌ నుంచే పశ్చిమానికి వ్యాపించాయనే సూత్రీకరణా ఉంది.  స్త్రీల నుంచి స్ల్రీలకు బదిలీ అయ్యే  మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ  మన ఉపఖండ ప్రత్యేకతగా ఉంది. 

కొన్ని వేల సంవత్సరాలుగా  స్థానికులు( ఇండీజీనియస్‌) భారత్‌లో ఉన్నారని ఈ పరిశీలన సూచిస్తోంది. అయితే పురుషుల నుంచి పురుషులకు బదిలీ అయ్యే ‘వై’ క్రోమోజోమ్ల ప్రాతిపదికన పశ్చిమ యూరో ఆసియన్లు, ఇరాన్‌ పీఠభూమి, మధ్య ఆసియన్లతో భారత్‌కు ఎక్కువ సంబంధాలున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు సింధు నాగరికతకు చెందిన ప్రజలెవరన్న ప్రశ్న ముందుకొచ్చింది. వారికి ద్రవిడియన్లుగా ముద్రపడ్డవారితో లేక  ఆర్యుల వలసల కారణంగా దక్షిణాదికి పరిమితమైన వారితో వీరికి సంబంధాలున్నాయా ? లేదా వారే ఆర్యులా ? వారే క్రమంగా దక్షిణాదికి తరలివచ్చారా అన్న ప్రశ్నలకు జవాబులు ఈ అధ్యయనంలో లభించవచ్చునని భావిస్తున్నారు. 

కనుక్కున్నది ఏమిటీ ?
ఈ అధ్యయనంలోని జన్యుపరమైన అంచనా ప్రకారం ప్రాచీన భారతం...  ఉత్తర, దక్షిణ  ప్రాంతాల ప్రజల పూర్వీకులను రెండు ప్రత్యేక బృందాలుగా విభజించారు. ప్రస్తుత యూరోపియన్లు, తూర్పు ఆసియన్ల మాదిరిగా  ఈ బృందాలు రెండు కూడా ఒక దానికి ఒకటి పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నారు. అయితే ఈ రెండు జాతులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్న. వివిధ కాంబినేషన్లలో మూడు బృందాలు కలగలిసి పోయి ఈ రెండు జాతులు ఏర్పడడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. అవి...

–ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంత పూర్వీకులుగా పేర్కొన్నవారు (దక్షిణాసియాలో వేట ప్రధాన వృత్తిగా ఉన్న వారు) ఉపఖండంలో అతి ప్రాచీన ప్రజలని తేల్చారు. వీరికి ఆధునిక అండమాన్‌ ద్వీప ప్రజలతో సారూప్యతలున్నాయి.
–ఇరాన్‌కు చెందిన రైతులు ఉపఖండానికి వలస వచ్చారు. వారి ద్వారా గోధుమలు, బర్లీ వంటి పంట పద్ధతులు ఇక్కడకు వచ్చాయి. 
– మధ్య ఆసియా నుంచి ఉత్తర అప్ఘనిస్తాన్‌ వరకున్న ప్రాంతంలోని ప్రజలు (ఆర్యులుగా గతంలో పిలిచేవారు) భారత్‌కు వలస వచ్చినవారిలో ఉన్నారు. 
వీరితో పాటు దక్షిణ ఆసియాతో సంబంధాలున్న ముఖ్యమైన జనాభా సింధు నాగరికతకు చెందినదిగా భావిస్తున్నారు.సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలు చాలా మటుకు భారత జనాభాకు వారధిగా నిలుస్తూ దక్షిణాసియా పూర్వీకులకు సంబంధించి ప్రధాన వనరుగా నిలుస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. 
     –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top