
న్యూఢిల్లీ: హింసామార్గం ఏ సమస్యనూ పరిష్కరించలేదని, ప్రజల జీవితాలు మెరుగుపడిన దాఖలాలు లేవని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దం సైన్స్, టెక్నాలజీ, ప్రజాస్వామ్యాలదంటూ ఆయన.. ఏ సమస్య పరిష్కారం అయినా శాంతియుత పద్ధతుల్లోనే జరగాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మొట్టమొదటి మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం నాడే మన్‌కీ బాత్ కూడా రావడంతో ఉదయం 11 గంటలకు బదులు సాయంత్రం 6 గంటలకు ప్రధాని రేడియో ద్వారా మాట్లాడారు.
ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం తగ్గుముఖం పట్టిందన్నారు. ‘అస్సాంలో 8 సంస్థలకు చెందిన 644 మంది ఉగ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరిస్తున్నందునే వీరంతా హింసామార్గం వీడుతున్నారు’అని అన్నారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన జల్‌శక్తి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఉత్తరాఖండ్‌లోని అల్మోరా–హల్ద్వానీ హైవే పక్కన ఉన్న సునియాకోట్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. అలాగే, తమిళనాడులో వర్షం నీటిని బోరుబావి ద్వారా ఒడిసిపట్టడం అద్భుతమైన ఆలోచన’అని ఆయన అన్నారు.
ఈ నెల 22వ తేదీతో ముగిసిన మూడో ఖేలో ఇండియా గురించి మాట్లాడుతూ..‘మూడేళ్లుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 వేల మంది బాలల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నుంచి వర్సిటీల స్థాయిలో కూడా ఖేలో ఇండియా నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఒరిస్సాలో జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ స్థాయి ఆటల పోటీల్లో 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు’అని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ... ‘ఈ మిషన్ మరో అడుగు ముందుకు పడింది. ఈ మిషన్‌కు వైమానిక దళానికి చెందిన నలుగురు పైలెట్లు ఎంపికయ్యారు. వీరు దేశం ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కలలకు ప్రతిబింబాలు. ఈ మిషన్‌లో భాగస్వాములందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’అని తెలిపారు.