రెడీ.. 3, 2, 1

Preparations were made to conduct the PSLV C 46 experiment - Sakshi

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–46 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో భాగంగా నాలుగోదశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి పూర్తి చేశారు. మళ్లీ మంగళవారం రాత్రే రెండోదశలో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా చేస్తున్నారు. మంగళవారం నాడు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి సహచర శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగ పనులు సమీక్షించారు.   
 – సూళ్లూరుపేట

ప్రయోగం ఇలా...
షార్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–46 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 615 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీ అనే (రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌) దూర పరిశీలనా ఉపగ్రహాన్ని 15.29 నిమిషాల్లో భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్‌ బూస్టర్లు లేకుండా చేస్తున్నారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్‌–2బీ ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది.

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో పాల్గొని పీఎస్‌ఎల్‌వీ సీ–46 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్క రించారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–46 శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపనున్నట్లు శివన్‌ తెలిపారు. తదుపరి ప్రాజెక్ట్‌గా జూలై 9, 16 తేదీల్లోపు చంద్రయాన్‌–2 మిషన్‌ను కూడా ప్రయోగించనున్నట్లు, చంద్రునిపైకి సెప్టెంబర్‌ 6న చంద్రయాన్‌–2 ల్యాండ్‌ అవుతుందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top