శాస్త్ర, సాంకేతికతలే చోదక శక్తి | Sakshi
Sakshi News home page

శాస్త్ర, సాంకేతికతలే చోదక శక్తి

Published Sat, Jan 4 2020 3:51 AM

PM Modi inaugurates Indian Science Congress in Bengaluru  - Sakshi

బెంగళూరు, సాక్షి: ‘సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం, వాటికి పేటెంట్‌ సాధించడం, పరిశ్రమ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి సాధించడం (ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్‌)’ అనే నాలుగు మార్గాలు దేశ పురోగతిని శీఘ్రతరం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతి పైననే దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం 107వ ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ను ప్రధాని ప్రారంభించారు.

అనంతరం, ప్రారంభోపన్యాసం చేస్తూ.. దేశ శాస్త్ర సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజల చేత, ప్రజల కొరకు సృజనాత్మక ఆవిష్కరణలు జరగడమే నవభారత నిర్మాణానికి కొత్త దిక్సూచి అన్నారు. ప్రపంచ సృజనాత్మక సూచీలో భారత్‌ స్థానం 52కి చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు 60 ఏళ్ల కన్నా.. గత ఐదేళ్లలో స్టార్ట్‌ అప్స్, బిజినెస్‌ టెక్నాలజీ ఇంక్యుబేటర్ల విషయంలో భారతగణనీయ ప్రగతి సాధించిందన్నారు. ఇందుకు కారణమైన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

‘సైన్స్, టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి’ని ఈ సంవత్సరం సైన్స్‌ కాంగ్రెస్‌ థీమ్‌గా ఎంపిక చేసుకోవడం ముదావహమన్నారు. పరిపాలనలోనూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ గవర్నెన్స్‌ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేశామన్నారు. మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఈ – కామర్స్‌ తదితర సేవలను గ్రామీణ, పట్టణ ప్రజలు కూడా పొందగలుగుతున్నారని ప్రధాని వివరించారు. డిజిటల్‌ సేవలను మునుపెన్నడూ లేనంత స్థాయిలో  విస్తరించామన్నారు. వాతావరణ వివరాలను రైతులు ఇప్పుడు సులువుగా తెలుసుకోగలుగుతున్నారన్నారు. శాస్త్ర సాంకేతిక ఆధారిత పాలన రానున్న దశాబ్దంలో కీలకంగా మారనుందన్నారు.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూడండి
ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ ప్లాస్టిక్‌కు చవకైన, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని శాస్త్రవేత్తలను కోరారు. 2022 నాటికి ముడి చమురు దిగుమతిని 10% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందువల్ల బయో ఇంధనం, ఇథనాల్‌ రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందేందుకు పరిశ్రమల అవసరాలకు తగ్గ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌.రాజేంద్ర ప్రసాద్, సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.ఎస్‌.రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..
► ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ద్వారానే పరిష్కారం సాధ్యం.

► స్మార్ట్‌ఫోన్లు, చౌకైన ఇంటర్నెట్, డేటా లభ్యత కారణంగా ఇప్పుడు కోట్లాది మంది రైతులు, మహిళలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా అందించగలుగుతున్నాం.

►  స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలు గ్రామీణాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

► ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్‌ మిషన్‌ను ప్రారంభించాం.

►  పట్టణాలు, నగరాల్లో మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి ఉపయోగించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. తక్కువ నీటిని వినియోగించి ఎదిగే విత్తనాలను సృష్టించండి.

► ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు.

► మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను సమర్థంగా, చౌకగా వెలికితీయగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

 

Advertisement
Advertisement