
బినామీ చట్టంలో మార్పులు తప్పవు: మోదీ
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలు ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ పథకాలను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా తెలియజేశారు. వీటి ద్వారా చిన్నచిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ధి పొందనున్నట్లు మోదీ చెప్పారు. దీనిని దేశ ప్రజలకు క్రిస్మస్ బహుమానంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలకు తొలుత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలిపారు.
2017 అందరినీ సంతృప్తి పరుస్తుందని అన్నారు. ఇటీవల నగదు రహిత లావాదేవీలు 200-300శాతం పెరిగాయని చెప్పారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సహకానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అసోం ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల విషయంలో బాగా కృషి చేస్తోందని కొనియాడారు. అవినీతిని పూర్తిగా పెకలించేందుకు బినామీ ప్రాపర్టీ చట్టంలో సమూల మార్పులు చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అవినీతి అంతమొందించే విషయంలో తాను తీసుకున్న ఈ నిర్ణయం అంతం కాదని కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు.