తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | petrol price cut by rs 2.42 a litre, diesel rate lowered by rs-2.25 | Sakshi
Sakshi News home page

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Jan 17 2015 1:30 AM | Updated on Sep 2 2017 7:46 PM

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి

పెట్రోల్‌పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గింపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఆరేళ్ల కనిష్టానికి తగ్గడంతో పెట్రోల్‌పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నిజానికి అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. లీటరు పెట్రోలుపై రూ. 4.42, లీటరు డీజిల్‌పై రూ. 4.25 తగ్గాల్సి ఉంది. అయితే, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఎక్సైజ్ పన్నును మరో రెండు రూపాయలు పెంచుతూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుడికి దక్కాల్సిన ప్రయోజనంలో ఆ రెండు రూపాయలు కోత పడింది. గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరను వరుసగా తొమ్మిదోసారి, డీజిల్ ధరను ఐదోసారి తగ్గించారు. ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 14.69, డీజిల్ ధర రూ. 10.71 తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్ గత జూన్‌లో 115 డాలర్లుండగా, ప్రస్తుతం అది 46 డాలర్లకు పడిపోయింది. తగ్గింపు అనంతరం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 64.37కు, డీజిల్ ధర రూ. 55.02 నుంచి రూ. 52.57కు తగ్గింది.
 
 ప్రభుత్వానికి 20 వేల కోట్ల ఆదాయం.. గత నవంబర్ నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పెంచడం నాలుగోసారి. జనవరి 2వ తేదీనే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ పన్నును రూ. 2 పెంచింది. రెండు వారాలు తిరగకముందే మరో రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా పెట్రోలు, డీజిల్‌పై నవంబర్ 12, డిసెంబర్ 2న ఎక్సైజ్ పన్నును పెంచింది. ఈ పెంపుల వల్ల మొత్తంమీద వినియోగదారులు లీటరుకు పెట్రోల్‌పై రూ. 7.75, డీజిల్‌పై రూ. 6.50ల ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. అలాగే, ఈ పెంపుల మూలంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోంది. ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికీ చేరువవుతోంది.
 
 ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: కాంగ్రెస్

 ఎక్సైజ్ పన్నును పెంచి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారుడికి చేరడం లేదని, ఇది అన్యాయమని కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement