పెట్రోల్‌ 1 పైసా తగ్గింది

Petrol, diesel price cut revised to 1 paisa a litre - Sakshi

తొలుత 60 పైసలు తగ్గినట్టుగా చమురు సంస్థల ప్రకటన

ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఒక పైసానే తగ్గిస్తున్నట్టు వెల్లడి

మోదీజీ వేళాకోళమా: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలకు బ్రేక్‌ పడింది. బుధవారం పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) తొలుత లీటర్‌కు 60 పైసల చొప్పున పెట్రో ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రోజువారీ ధరల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలకే సాంకేతిక లోపం కారణంగా అలా వచ్చిందని.. వాస్తవానికి తగ్గించింది ఒక పైసా మాత్రమే అని చమురు సంస్థలు స్పష్టంచేశాయి. 

సాంకేతిక లోపం వల్లే..: ఐవోసీ
తగ్గించిన మొత్తం 1 పైసానే అని, క్లరికల్‌ ఎర్రర్‌ కారణంగా మే 25 నాటి ధర.. బుధవారం నాటి ధరగా ప్రకటించామని, వాస్తవానికి తగ్గించింది ఒక పైసానే అని ఐవోసీ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఐవోసీ దీనిపై ఓ ప్రకటన చేసింది. ఒక పైసా తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 78.42కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.30కి తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోందని, దీంతో దిగుమతుల ధర తగ్గుతుందని, దీని ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రో ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి 16 రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ. 3.80.. డీజిల్‌ ధర లీటర్‌కు రూ.3.38 పెరిగింది.

పిల్ల చేష్టలా ఉంది: రాహుల్‌
పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ మండిపడ్డారు. ప్రజలను వేళాకోళం చేయడానికి  మోదీ ఈ ఐడియా వేయలేదు కదా అని ఎద్దేవా చేశారు. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉందని విమర్శించారు. ‘డియర్‌ పీఎం. ఈ రోజు పెట్రోల్, డీజిల్‌ ధరలను మీరు ఒక పైసా తగ్గించారు. ఒక్క పైసానా..!?? ప్రజలను వేళాకోళం చేయడానికి మీరు వేసిన ఐడియా కాదు కదా ఇది. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.  

పెట్రో ధరలను రూ. 1 తగ్గించిన కేరళ
తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్‌ తమ రాష్ట్రంలో పెట్రో ధరలను లీటర్‌కు రూ. 1 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.509 కోట్ల భారం పడుతుందని విజయన్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top