ప్లాస్టిక్‌ చెత్తను పాతరేద్దాం..

People To Avoid Single Use Plastic - Sakshi

‘ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదు.. తరచి చూచిన.. ప్లాస్టిక్‌ ఎందెందు వెదకినా అందందే గలదు’
ఇదీ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ పరిస్థితి. మనిషికి ప్రియమైన శత్రువుగా మారిపోయిన ఈ ప్లాస్టిక్‌ను వదిలించుకునేందుకు ఇప్పుడిప్పుడే సీరియస్‌గా ప్రయత్నాలు మొదలయ్యాయి. మన ప్రధాని మోదీ సైతం తన ‘మన్‌కీ బాత్‌’లో ప్లాస్టిక్‌ చెత్తను వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే మనం ఏం చేయొచ్చు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న మంచి పద్ధతులేంటి..?

సగం ప్లాస్టిక్‌ చెత్త రీసైక్లింగ్‌
జర్మనీ, ఆస్ట్రియా, కొరియాతో పాటు బ్రిటన్‌లోని వేల్స్‌లో ప్లాస్టిక్‌ చెత్త రీసైక్లింగ్‌ అత్యంత సమర్థంగా జరుగుతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్‌లో కనీసం సగం మొత్తాన్ని మళ్లీ వాడుకునేలా చేస్తున్నారు. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వ డంతో పాటు.. నిధులు, మౌలిక సదు పాయాలు కల్పించడం ఇం దుకు కారణం. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు సంబంధించి మున్సిపాలిటీలు, పంచాయతీలు సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు అమలు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

ఈ–వేస్ట్‌ పనిపడతారు..
వాడేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల చెత్తను వదిలించుకునే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ విధానం నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను బాధ్యతాయుతంగా వాడటంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం.. దిగుమతి చేసుకున్న లేదా దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను సక్రమంగా రీసైకిల్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం.. జాతీయ స్థాయిలో రీసైక్లింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం.. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేస్తోంది. కొలంబియాలో ఏటా దాదాపు 2.5 లక్షల టన్నుల ఈ–వేస్ట్‌ ఉత్పత్తి అవుతోంది.

చెత్త సేకరణకు ఆరోగ్య బీమా..
ఇండోనేసియాలో ప్లాస్టిక్‌ చెత్తను సేకరించే వారికి ‘గార్బేజ్‌ క్లినికల్‌ ఇన్సూరెన్స్‌’కింద ఆరోగ్య సేవలు అందుతాయి. గమాన్‌ అల్బిసెయిద్‌ నేతృత్వంలోని ‘ఇండోనేసియా మెడికా’అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 600 మంది ఈ ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రీసైకిల్‌ చేసేందుకు అనువైన పదార్థాలను సేకరించి తీసుకురావడం.. ప్రతిఫలంగా మలాంగ్, జకార్తాల్లోని మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందడం ఈ పథకం ప్రత్యేకత.

సింగపూర్‌ ఆదర్శం..
మొత్తం 40 లక్షల మంది జనాభా మాత్రమే ఉండే సింగపూర్‌.. చెత్త నిర్వహణ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న విషయం తెలి సిందే. మండించేందుకు అవకాశమున్న చెత్తను ఇంధన ఉత్పత్తికి వాడు కోవడం.. తడిచెత్తను క్రమపద్ధతిలో ల్యాండ్‌ఫిల్స్‌లో నింపి అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయ త్నం చేయడం సింగపూర్‌ మోడల్‌లో చెప్పుకోదగ్గ విశేషాలు. భవన నిర్మాణ వ్యర్థాలను అత్యంత సమర్థంగా తగ్గించుకునే విషయంలో సింగపూర్‌ మిగిలిన దేశాల కంటే ఎంతో ముం దుంది. 2005 నాటికే ఈ చిన్న దేశం 94 శాతం భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్‌ చేసేసింది.

  • ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి.
  • పాల ప్యాకెట్లలో వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ఒడిశాలో ఇటీవలే పాల ఏటీఎంలు మొదలయ్యాయి. క్యాన్లు, పాత్రలు తీసుకెళ్లి ఈ ఏటీఎంల నుంచి పాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
  • చెత్త సేకరించే వారు తెచ్చే ప్లాస్టిక్‌కు బదులు భోజనం పెట్టే పథకం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ పట్టణంలో అమలవుతోంది. కిలో ప్లాస్టిక్‌ చెత్తకు ఒక పూట భోజనం అందిస్తున్నారు. అరకిలో చెత్తతో బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తారు.
  • అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి.. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో వెదురుబొంగులు వాడటం మొదలుపెట్టారు.
  • బెంగళూరులోని 6 హోటళ్లలో ఆహారం పార్సిల్‌ చేసేందుకు ప్లాస్టిక్‌ వాడట్లేదు. వినియోగదారులే పాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • కేరళలోని కొంతమంది జాలర్లు వేట నుంచి తిరిగొచ్చేటప్పుడు చేపలతో పాటు సముద్రంలోని ప్లాస్టిక్‌ చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నారు.
  • తమిళనాడులో కొంతమంది ఔత్సాహికులు ప్లాస్టిక్‌ స్ట్రాలకు బదులు బొప్పాయి ఆకు కాడలను స్ట్రాలుగా వాడటం మొదలుపెట్టారు.
  • జొన్న చొప్పతో ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం కొత్త పద్ధతిని అభివృద్ధి చేస్తోంది.
  • గొంగడి పురుగులు ప్లాస్టిక్‌ చెత్తను ఇష్టంగా తిని జీర్ణం చేసుకోగలవని పుణేలోని డాక్టర్‌ రాహుల్‌ మూడేళ్ల కిందటే గుర్తించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను కొన్ని రకాల గొంగడి పురుగులు తినేయడంతో పాటు వాటి విసర్జితాలు ఎరువుగానూ ఉపయోగపడతాయని గుర్తించారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top