
అరుదైన ఖనిజాల రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో అరుదైన ఖనిజాల రీసైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురాబోతోంది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి అమోదముద్ర వేశారు. అరుదైన ఖనిజాల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రతిఏటా 270 కిలో టన్నుల రిసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఏటా 40 కిలో టన్నుల అరుదైన ఖనిజాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో భాగంగా ఇన్సెంటివ్ స్కీమ్‌ను తీసుకురాబోతున్నారు. ఏడేళ్లలో రూ. 34,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను అమలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. కాపర్, లిథియం, నికెట్, కోబాల్ట్ సహా రేర్‌ఎర్త్ ఖనిజాల రీసైక్లింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
ప్రధాని మోదీ హర్షం
కేబినెట్‌లో ఆమోదించిన ఇన్సెంటివ్ పథకం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీనివల్ల అరుదైన ఖనిజాల రీసైక్లింగ్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. బ్యాటరీ వ్యర్థాలు, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ సామర్థ్యం పెరుగుతుందని, ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు.