'పఠాన్కోట్ దాడి భారత్ ఆడిన నాటకం'

'పఠాన్కోట్ దాడి భారత్ ఆడిన నాటకం' - Sakshi


ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు విషయంలో పాకిస్థాన్ మీడియా విషం చిమ్ముతున్నది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ బరితెగింపు రాతలు రాసింది. ఆ అడ్డగోలు రాతలకు ఆధారమంటూ యూపీలో ఎన్ఐఏ అధికారి హత్యను బూచిగా చూపెట్టే ప్రయత్నం చేసింది.'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై  ఉగ్రదాడి భారత్ ఆడిన భారీ నాటకం. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు పన్నిన కుట్ర' అని ఇటీవలే భారత్ లో పర్యటించిన సంయుక్త దర్యాప్తు బృందం(జిట్) అధికారి తమకు చెప్పాడని 'పాకిస్థాన్ టుడే' పత్రిక సోమవారం ఒక కథనాన్ని రాసింది. 'ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు బిల్డప్ ఇచ్చింది. ఇదంతా పాకిస్థాన్ ను బదనామ్ చేయడానికే' అని కూడా సదరు అధికారి పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది.ఎన్ఐఏ అధికారి హత్యపై కట్టుకథ

ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యోదంతాన్ని పాక్ మీడియా తన కట్టుకథలకు ఆధారంగా చూపెట్టే ప్రయత్నం చేసింది. భారత అధికారులు ఆడిన నాటకం బయటపడకుండా ఉండేందుకే ముస్లిం అయిన తంజిల్ అహ్మద్ ను హత్యచేయించారని కట్టుకథ అల్లింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో తమను తిప్పితిప్పి విసిగించారేతప్ప సరైన ఆధారాలు చూపకపోవడం కూడా నాటకంలో భాగమేనని జిట్ అధికారులు అన్నట్లు మీడియా పేర్కొంది.జనవరి 2న గుజరాత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రమూక జరిపిన దాడిలో ఏడుగురు జవానులు అమరులవ్వగా, ఆరుగురు ముష్కరులు హతమైన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాదులు మసూద్ అజార్ జైషే సంస్థకు చెందినవారని, వచ్చింది పాకిస్థాన్ నుంచే ననే ఆధారాలను భారత అధికారులు ఇదివరకే పాకిస్థాన్ కు సమర్పించారు. ఆ ఆధారాలను బట్టి పాక్ దర్యాప్తు బృందం(జిట్) పఠాన్ కోట్ ను సందర్శించింది కూడా. ఒకటి రెండు రోజుల్లో పాక్ బృందం తన నివేదికను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందించనుంది. ఈ లోపే నిజానిజాలను వక్రీకరించే ప్రయత్నం తలకెత్తుకుంది పాకిస్థాన్ మీడియా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top