కొండవీటి వాగు సహజ స్వరూపాన్ని ఎందుకు దెబ్బ తీస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కొండవీటి వాగు స్వరూపంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: కొండవీటి వాగు సహజ స్వరూపాన్ని ఎందుకు దెబ్బ తీస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి వరద ముప్పు ఉండగానే పర్యావరణ అనుమతులు దక్కడంపై దాఖలైన పలు పిటిషన్లను ఎన్జీటీ మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ, గుంటూరు ప్రమోద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతం వరద ప్రభావ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ వరద ప్రభావ ప్రాంతం క్రియాశీలకంగా లేదని, వరదలు వచ్చిన చరిత్ర లేదని పేర్కొన్నారు.
కొండవీటి వాగు ప్రవాహం వర్షాకాలానికే పరిమితమై ఉంటుందని, ఎలాంటి వరద ముప్పు లేకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెపుతూ.. వాగుకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులను చూపించారు. వాగు సహజ ప్రవాహ దిశను మళ్లించే యత్నం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఫారిఖ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ ఛైర్మన్ స్పందిస్తూ... అంత చక్కగా సహజ ప్రవాహ దిశను కలిగి ఉన్న కొండవీటి వాగును ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం ఆక్రమణలను తొలగిస్తున్నామని గంగూలీ వివరించారు. విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా పడింది.