ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్‌ : చిన్నారి మృతి

Newborn Dies As Ambulance Gets Stuck In Congress Rally - Sakshi

చండీగఢ్‌ : హర్యానాలోని సోనిపట్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌  చీఫ్‌ అశోక్‌ తన్వర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో నవజాత శిశువు ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ చిక్కుకుపోవడం చిన్నారి మరణానికి దారితీసింది. నవజాత శిశువు మరణించిన ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటైంది. చిన్నారిని అం‍బులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా,తన్వర్‌ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయిందని బంధువులు తెలిపారు.

కాంగ్రెస్‌ ర్యాలీ కారణంగా 45 నిమిషాల పాటు అంబులెన్స్‌ నిలిచిపోవడంతో నవజాత శిశువైన తమ కుమారుడు మరణించాడని చిన్నారి తండ్రి రోదించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సదుపాయం లేదన్నారు.తమను తొలుత సోనిపట్‌ ఆస్పత్రికి అటు నుంచి రోహ్‌తక్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారని, ఆస్పత్రికి తీసుకువెళుతుండగా కాంగ్రెస్‌ ర్యాలీ కారణంగా గంటన్నర ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చిన్నారి మరణించాడని నవజాత శిశువు బంధువులు చెప్పారు.

రోడ్డుపై నిలిచిన అంబులెన్స్‌కు దారిఇవ్వాలంటూ డ్రైవర్‌ పలుమార్లు సైరన్‌ మోగించినా ఫలితం లేకపోయిందన్నారు. అయితే ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాలుడి తండ్రి పేర్కొన్న వీడియో తమవద్ద ఉందని తన్వర్‌ చెప్పారు. అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుందని తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్తలు రోడ్డును క్లియర్‌ చేసి అంబులెన్స్‌ను పంపించివేశారని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top