
పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత వైమానిక దళం (ఎఐఎఫ్) దాడిచేసిన తర్వాత దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్తాన్‌లో ఓ జంటకు పుట్టిన బిడ్డకు ‘మిరాజ్ సింగ్ రాథోడ్’అని పేరు పెట్టుకున్నారు. పాక్ బాలాకోట్‌లోని జైషే శిక్షణా స్థావరంపై ఐఏఎఫ్ యుద్ధ విమానం దాడిచేసిన సమయంలోనే మంగళవారం ఉదయం 3.50 నిమిషాలకు బిడ్డ పుట్టడంతో యుద్ధ విమానం పేరు పెట్టుకున్నట్లు ఆ జంట తెలిపింది. రాజస్తాన్ నాగ్‌పూర్ జిల్లాలోని దబ్డా గ్రామానికి చెందిన మహవీర్ సింగ్, సోనమ్ సింగ్‌లు సైనిక కుటుంబ నేపథ్యం ఉన్నవారు.
ఫ్రీ.. ఫ్రీ..
ఢిల్లీకి చెందిన మనోజ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోపైన ‘ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ! పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఆనందంలో ఈ రోజు మీ సేవలో ఈ ఆటో తరిస్తుంది.. వీరుల పేరుతో.. సైనికులకు ప్రణామాలతో.. మోదీకి ధన్యవాదాలతో..’అన్న నినాదాలతో పోస్టర్ అంటించు కుని ఉచితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చా రు. ప్రైవేటు వ్యాపారులు కూడా ఆహార పదార్థాలపై, వివిధ ఉత్పత్తులపై ఒక రోజు ఆఫర్లు ప్రకటించారు. జైషే తీవ్రవాద శిబిరంపై ఐఏఎఫ్ దాడి తర్వాత రాజ్‌కోట్‌లోని ఒక మిఠాయి దుకాణం ఉచితంగా స్వీట్లు పంచింది.