నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు | Misleading of black money country | Sakshi
Sakshi News home page

నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు

Nov 27 2014 12:51 AM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు - Sakshi

నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు

నల్లధనం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ దేశాన్నే తప్పుదోవ పట్టించిందని, దీనిపై కేంద్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

సర్కారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి  పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్ డిమాండ్
 
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ దేశాన్నే తప్పుదోవ పట్టించిందని, దీనిపై కేంద్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతిపక్షాల డిమాండ్‌తో నల్లధనంపై బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగింది. ‘ఓటింగ్‌కు అవకాశం లేని’ 193వ నిబంధన కింద జరిగిన చర్చలో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్‌పీ తదితర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే, విదేశాలనుంచి  నల్లధనాన్ని తెప్పించడంలో సరైన మార్గంలో పయనిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
 
ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారు...

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే చర్చను ప్రారంభించారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తే దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికీ రూ. 15లక్షల చొప్పున వస్తాయంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ద్వారా ప్రధాని మోదీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారన్నారు. వందరోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కు తెస్తామన్నారని, ఇపుడు అధికారంలోకి వచ్చినా పైసా కూడా తేలేదని విమర్శించారు. 125 కోట్ల మంది ప్రజలను తప్పుదారి పట్టించి, తప్పుడు హామీలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నల్లధనంపై ప్రజలను తప్పు దారిపట్టించినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని తృణమూల్ నేత సుదీప్ బంధోపాధ్యాయ్ డిమాండ్ చేశారు. నల్లధనం దాచిన వారందరి పేర్లనూ ప్రభుత్వం ఇంటర్నెట్‌లో పెట్టాలన్నారు.

సిట్‌కు ‘సీల్డ్ కవర్’ ఇచ్చింది మేమే: బీజేపీ

నల్లధనం అంశంపై బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు.   హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల ఖాతాదార్ల పేర్లను సీల్డ్ కవర్‌లో సిట్‌కు అందించింది తమ ప్రభుత్వమేని, నల్లధనం అంశాన్ని జీ-20 సదస్సు వేదికపైప్రస్తావించింది మోదీయేనని అన్నారు. తృణమూల్‌పైనా అనురాగ్ మండిపడ్డారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లోని నల్లధనంపై మాట్లాడే ముందు దేశంలో ఏం జరుగుతోందనేది మాట్లాడాలన్నారు.
 
జనం వేచిచూస్తున్నారు: ఆనంద్‌శర్మ

నల్లధనంపై అవాస్తవాలు చెప్పినందుకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. విదేశాల్లో  నల్లధనం వెనక్కు తెస్తే.. ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు జమ చేయవచ్చని మోదీ ఎన్నికల ప్రచారంలో అన్నారని ఇపుడు నల్లధనం ఎంతో తెలియదని వారంటున్నారని విమర్శించారు. ‘మంచి రోజులు వచ్చాయి (అచ్చే దిన్ ఆగయా)’ అనే బీజేపీ నినాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మంచి రోజులు వచ్చాయి.. జనం వారి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు’’ అని శర్మ ఎద్దేవా చేశారు. నల్లధనం వెనక్కు తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ విమర్శించారు. జేడీయూ సీనియర్ నేత శరద్‌యాదవ్ , బీఎస్‌పీ నేత మాయావతి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
 
జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్సే: బీజేపీ

నల్లధనంపై స్వయంగా ఎలాంటి చర్యలూ చేపట్టని కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని బీజేపీ ఎంపీ విజయ్‌గోయల్ రాజ్యసభలో విమర్శించారు.  నల్లధనం అంశంపై జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్సే అన్నారు.
 
427 మందిని గుర్తించాం: జైట్లీ


విదేశాల్లో బ్యాంకు ఖాతాలు గల వారి పేర్లతో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఇచ్చిన 627 మంది జాబితాలో 427 మందిని గుర్తించామని.. అందులో 250 మంది తమకు ఖాతాలున్నట్లు అంగీకరించారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. నల్లధనంపై చర్చకు ఆయన రాజ్యసభలో సమాధానమిస్తూ నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు తమ ప్రభుత్వం సరైన మార్గంలో పయనిస్తోందని, నల్లదనాన్ని రప్పించే ప్రక్రియకు వ్యవధి పడుతుందని అన్నారు. అయితే.. జైట్లీ సమాధానం కొనసాగుతుండగానే కాంగ్రెస్, తృణమూల్, జేడీయూ, ఎస్‌పీ, సీపీఎం సభ్యులు వాకౌట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement