‘సందేశాల’ గణపతి

Lord Vinayaka Idol Gave Massages To Devotees In Goa - Sakshi

భక్తులకు సందేశాలు రాసి ఇస్తున్న వినాయకుడు

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ మండపమది. దాంట్లో చేతిలో ఘంటంతో రాస్తున్న భంగిమలో వినాయకుడి విగ్రహం ఉంది. భక్తుడు మండపంలోకొచ్చి అక్కడున్న గంటను మోగించగానే వినాయకుడు తల ఊపుతూ రాయడం మొదలు పెడతాడు.రాత పూర్తవగానే అక్కడున్న ప్రింటర్‌లోంచి ఒక కాగితం బయటకు వస్తుంది. దాంట్లో రోడ్డు భద్రత, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సందేశం ఒకటి ఉంటుంది. ఆ కాగితాన్నే గణపతి ప్రసాదంగా భక్తుడు ఇంటికి తీసుకెళ్లిపోతాడు...

ఇది గోవాలోని ఫాంటైన్‌హాస్‌ దగ్గరున్న వారసత్వ ప్రాంతమైన ఫాంటే ఫోనిక్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రత్యేకత. సామాజిక సందేశాలను స్వయంగా రాసి ఇచ్చే ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. యువ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ యాంత్రిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించింది.ఊరికే వినాయకుడి విగ్రహాన్ని పెట్టే బదులు దాని ద్వారా ఏదైనా సామాజిక ప్రయోజనం సాధించాలని భావించాం. అందుకే ఈ యాంత్రిక గణపతిని నెలకొల్పాం. రహదారి భద్రత, పరిశుభ్రత, మహిళా సాధికారత, కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగాలకు సంబంధించిన సందేశాలు ఆయన రాసి భక్తులకు ఇస్తున్నారు. వాటిని భక్తులు ఎంతో భక్తితో ఇంటికి తీసుకెళుతున్నారు.’అంటూ తమ ఉద్దేశాన్ని వివరించారు యువ వ్యవస్థాపకుడు రఘువీర్‌ మహలే.

ఈ విగ్రహాన్ని సుద్ద ముక్కలతో  తయారు చేశారు. విగ్రహం తయారీకి  నెలన్నర పట్టిందని,5వేల సుద్దముక్కలు వాడామని మహలే తెలిపారు. కరెంటు ఎక్కువ ఖర్చు కాకూడదన్న ఉద్దేశంతో గంట మోగినప్పుడే వినాయకుడి విగ్రహం కదిలేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top