సంచలన తీర్పు: పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు

Kerala HC Allows Muslim Teenage Couple to Be in Live In Relationship - Sakshi

కొచ్చి: పెళ్లి చేసుకోకపోయినా ఓ 18 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి కలిసి ఉండవచ్చని కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. సహ జీవనాన్ని తప్పుబట్టలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు రాకపోయినా సహ జీవనం చేసే హక్కు ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన నెల రోజుల్లోనే కేరళ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ వీ చితంబరేష్, జస్టిస్ కేపీ జ్యోతీంద్రనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆ యువతి తండ్రి వేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను విచారించి కొట్టేసింది.

ఈ పిటిషన్‌తో వాళ్లను విడదీయలేమని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. ఇది సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినా.. మేజర్లు కావడంతో రాజ్యాంగబద్ధంగా వాళ్లకు సంక్రమించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తెలిపింది. సదరు యువకుడికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకొనే వయసు వచ్చే వరకు అతనితో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ యువతికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top