భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్‌’ | It Is A Millinium Joke About Indian Economy | Sakshi
Sakshi News home page

భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్‌’

Sep 13 2019 3:17 PM | Updated on Sep 13 2019 5:35 PM

It Is A Millinium Joke About Indian Economy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి ఆదోగతిలో పోతోందంటూ ఎంతో మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినా, అవును బాబోయ్‌! అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 2014 నుంచి 2018 వరకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన ఆర్వింద్‌ సుబ్రమణియన్‌ హెచ్చరించినా ‘అబ్బెబ్బె అదేం లేదంటూ’ సర్ది చెప్పుకుంటూ వచ్చిన మోదీ ప్రభుత్వం తీరు ఇప్పుడు మరీ విడ్డూరంగా తయారయింది. దేశంలో ఆటోమొబైల్‌ అమ్మకాలు దారుణంగా పడి పోవడానికి కారణం ‘సహస్రాబ్దుల ఆలోచనా విధానం’ అంటూ స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించడం సహస్రాబ్ది జోక్‌ కిందనే పరిగణించాలి.

సీతారామన్‌ చెప్పినట్లుగా నేటి యువత ఈఎంఐ చెల్లింపులకు భయపడి కార్లను కొనుగోలు చేయకుండా ఉబర్, ఓలా లాంటి క్యాబ్‌ సర్వీసులను ఆశ్రయిస్తుండడం వల్లనే ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు పడిపోవడం నిజమైతే అంతకన్నా తీపి కబురు మరోటి ఉండదు. ‘అర్బన్‌ ప్లానింగ్‌’లో ప్రధాన అంశం ప్రజా లేదా ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం. అంటే ప్రజలు సొంత కార్లపై ఆధారపడకుండా మెట్రో రైళ్లలోనో, క్యాబ్‌ సర్వీసుల్లో వెళ్లే వ్యవస్థ ఉండాలి. అప్పుడే ప్రవేటు వాహనాల కోసం రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉండదని, వాతావరణ కాలుష్యం దానంతట అదే తగ్గుతుందని, ఆ విధంగా పర్యవరణ పరిరక్షణకు తోడ్పడగలమన్నది తుది లక్ష్యం. మరి ఈ లక్ష్యం దిశగా యువత పోతున్నందుకు వారిని ప్రశంసించకుండా ఇలా నిందలు వేయడం ఏమిటీ? ఆటోమొబైల్‌ రంగానికి దాసోహమై ఇంతకాలం మూల పడేసిన పట్టణ ప్రణాళికల దుమ్ము దులిపి ఇక వెలికి తీయండి!

కానీ నిర్మలా సీతారామన్‌ మాటల్లో నిజం లేదు. అమ్మకాల రేటు పడిపోయింది ఒక్క ఆటోమొబైల్‌ రంగంలోనే కాదు. బొగ్గు, క్రూడాయిల్, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులతోపాటు ఉక్కు, సిమ్మెంట్, ఎలక్ట్రిసిటీ రంగాల్లో అమ్మకాల వద్ధి రేటు జూలై నాటికి 2.1 శాతానికి పడిపోయింది. గతేడాది ఇవి 7.3 శాతం వద్ధి రేటును సాధించాయి. ఆ మాటకొస్తే, ఉబర్, ఓలా వద్ధి రేటు కూడా ఆశాజనకంగా లేదు. ఈ రెండు సంస్థలకు ఆరు నెలల క్రితం రోజుకు మూడు లక్షల యాభై వేల ట్రిప్పులు ఉంటే జూలై నాటికి రోజువారి ట్రిప్పులు మూడు లక్షల ఆరవై ఐదు వేలకు చేరకున్నాయి. అంటే ఆరు నెలల్లో అదనంగా వచ్చిన ట్రిప్పులు కేవలం 15 వేలు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు తమపై కూడా ప్రభావం చూపడంతో ఆరు నెలల్లో నాలుగు శాతం వృద్ధి రేటును కూడా సాధించలేక పోయామని కంపెనీ వర్గాలే అంగీకరించాయి. సీతారామన్‌ చెప్పినట్లు యువత అంతా క్యాబ్‌లవైపు మొగ్గు చూపినట్లయితే వీటి వద్ధి రేటు కనీసం 25 శాతం పెరగాలి.

భారత జీడీపి వృద్ధి రేటు ఐదు శాతానికి పడి పోవడం పట్ల అంతర్జాతీయ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) కూడా తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. భారత్‌ జీడీపి వృద్ధి రేటు 2019–2020 సంవత్సరానికి ఏడు శాతం ఉంటుందని ఆ సంస్థ ముందుగా అంచనా వేసింది. మోదీ ప్రభుత్వం ఎక్కడ నొచ్చుకుంటుందని భావించిందేమోగానీ ఆ తర్వాత ఆ వృద్ధి రేటును 7.3 శాతంగా సవరించింది. తీరా వృద్ధి రేటు 5 శాతానికి మించలేదని తేలాక ఆశించిన స్థాయిలో లేకపోవడం దురదృష్టమంటూ సానుభూతిని చూపించింది. మరోపక్క ఈ ఆర్థిక లెక్కలన్నీ తప్పని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తేల్చడం మరింత విడ్డూరం. ‘ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను బలోపేతం చేయాలనుకుంటుంటే 12 శాతం వృద్ధి రేటు కావాలంటున్నారు. ప్రస్తుతం వృద్ధి రేటు ఆరేడు శాతం మాత్రమే ఉంది. ఈ ఆర్థిక లెక్కల్లోకి వెళ్లడం అనవసరం. గురుత్వాకర్షణ శక్తిని కనుక్కోవడానికి ఐనిస్టీన్‌కు ఈ లెక్కలేవీ అవసరం రాలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఆయన గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఐనిస్టీన్‌ కనుక్కున్నారనే చెప్పారు. గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఇసాక్‌ న్యూటన్‌ అనే మహా గణిత శాస్త్రజ్ఞుడనే విషయం తెలియని వ్యక్తికి ఏం చెబితే కనువిప్పు అవుతుంది.
(చదవండి: స్లోడౌన్‌కు చెక్‌ : సర్దార్జీ చిట్కా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement