90శాతం ఇళ్లకు కరెంటు లేకున్నా ఉన్నట్లే! | Is NDA reached to target about power to rural areas? | Sakshi
Sakshi News home page

90శాతం ఇళ్లకు కరెంటు లేకున్నా ఉన్నట్లే!

May 29 2017 5:03 PM | Updated on Oct 20 2018 5:26 PM

90శాతం ఇళ్లకు కరెంటు లేకున్నా ఉన్నట్లే! - Sakshi

90శాతం ఇళ్లకు కరెంటు లేకున్నా ఉన్నట్లే!

దేశంలోని 18,452 గ్రామాలను విద్యుద్దీకరించాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2015లో లక్ష్యంగా పెట్టుకుంది.

న్యూఢిల్లీ: దేశంలోని 18,452 గ్రామాలను విద్యుద్దీకరించాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2015లో లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయ్యే నాటికి వాటిలో 13,523 గ్రామాలకు మాత్రమే ఆ సౌకర్యం చేకూర్చగలిగింది. దేశవ్యాప్తంగా ఇంకా 25శాతం గ్రామాలు నేటికి కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నాయి. దేశంలో దాదాపు నాలుగున్నర కోట్ల ఇళ్లలో కరెంటు సౌకర్యం లేదు. ఈ వివరాలను కేంద్ర విద్యుత్‌ శాఖ గ్రామీణ విద్యుద్దీకరణ డాష్‌ బోర్డు లెక్కలే తెలియజేస్తున్నాయి.

13,523 గ్రామాల్లో కూడా వెయ్యి గ్రామాలకు మాత్రమే 100శాతం విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. ఇక్కడ 100శాతం విద్యుద్దీకరణ అంటే ప్రభుత్వ భవనాలు, పంచాయితీ ఆఫీసులు, ఆస్పత్రులు, ప్రభుత్వం పాఠశాల భవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు  గ్రామంలోని పది శాతం ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించడం. అంటే మిగతా 90 శాతం ఇళ్లకు కరెంటు లేకపోయినా నూటికి నూరు శాతం కరెంటు సరఫరాను ఇచ్చినట్లు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ పరిగణిస్తోంది. 1997, అక్టోబర్‌ నెల నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.

అందరికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్ల అనంతరం కూడా ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్‌ రాష్ట్రాలో యాభై శాతం కరెంట్‌ సౌకర్యాన్ని మాత్రమే కల్పించగలిగింది. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న 4.40 కోట్ల మందికి దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ్‌ యోజన పథకం కింది ఉచితంగా విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వారిలో 2.35 కోట్ల మందికి మాత్రమే ఉచితంగా విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించింది. అంటే దాదాపు 58 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించకలిగింది.


2018 సంవత్సరంనాటికి దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. నేటికి విద్యుత్‌ సౌకర్యం నోచుకోని గ్రామాలు నాలుగువేలకు పైగానే ఉన్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల్లో మాత్రమే దాదాపు 80 శాతం ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు ఈ విషయంలో బాగా వెనకబడి ఉన్నాయి. 2018, మే నెల నాటికి దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు కల్పిస్తామని పార్టీ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ పేర్కొంది. మిగిలి ఉన్న ఈ ఏడాది కాలంలో ఏ మేరకు లక్ష్యాలను అందుకుంటుందో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement