కరోనా: అంత్యక్రియలపైనా అలజడి | Irrational Fears on Corona Funerals in India | Sakshi
Sakshi News home page

చివరకు అంత్యక్రియలపైనా అలజడి

Apr 25 2020 6:14 PM | Updated on Apr 25 2020 6:16 PM

Irrational Fears on Corona Funerals in India - Sakshi

కరోనా బాధిత మృతదేహాల విషయంలో ‘కడావర్స్‌ డోంట్‌ ట్రిన్సిమిట్‌ డిసీస్‌’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెప్పింది.

సాక్షి, న్యూఢిల్లీ : చెన్నైకి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సైమన్‌ హెర్కులస్‌ కరోనా వైరస్‌ బారిన పడి ఏప్రిల్‌ 19వ తేదీన మరణించారు. ఆయన మృతదేహాన్ని కిల్‌పాక్‌ ప్రాంతంలోని శ్మశానంలో ఖననం చేసేందుకు మున్సిపల్‌ అధికారులు అనుమతించారు. అక్కడికి మృతదేహం తీసుకెళ్లాక ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించలేదు. దాంతో అన్నానగర్‌లోని శ్మశానానికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్, శానిటేషన్‌ వర్కర్, మున్సిపల్‌ ఉద్యోగి, ఇతరులు అంబులెన్స్‌ను వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయాక పోలీసుల రక్షణలో మున్సిపల్‌ అధికారులు మృతదేహాన్ని ఖననం చేశారు. తవ్వేందుకు గునపం లాంటి సాధనాలు లేకపోవడంతో అధికారులు చేతులతో గొయ్యి తవ్వాల్సి వచ్చింది.

అంతకుముందు మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 69 ఏళ్ల ప్రముఖ డాక్టర్‌ జాన్‌ ఎల్‌ సైలో మరణించగా, ఆయన మృతదేహాన్ని ఝాలుపరలోని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించకుండా పెద్ద ఎత్తున శ్మశానాన్ని చుట్టుముట్టారు. వారెవరు కరోనా సోకకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా మృతదేహాన్ని ఆ శ్మశానం ఖననం చేస్తే తమకు కరోనా సోకుతుందంటూ గొడవ చేశారు. చివరకు ఈ మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ డాక్టర్‌ ఫామ్‌ హౌజ్‌లో ఖననం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అంత్యక్రియలకు కూడా అనుమతించకుండా క్వారెంటైన్‌లో ఉంచారు. ప్రముఖ డాక్టర్ల విషయంలోనే ఇలా జరిగితే ఇక సామాన్యుల విషయంలో ఇంకెలా జరిగిందో ఊహించవచ్చు. అధికారులు ఎంత నచ్చ చెబుతున్నప్పటికి కరోనా మృతదేహాల విషయంలో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఘర్షణలు చెలరేగుతున్నాయి. (చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు..)

మృతదేహాల వల్ల వైరస్‌ సోకదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా బాధిత మృతదేహాల విషయంలో ‘కడావర్స్‌ డోంట్‌ ట్రిన్సిమిట్‌ డిసీస్‌’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెప్పింది. అంటే మృతదేహాలు రోగాలను వ్యాప్తి చేయవు అని అర్థం. వైరస్‌ బారిన పడి మరణించిన వారని ఖననం చేయడం కంటే కాల్చి వేయడమే మంచిదన్నది కూడా కేవలం అపోహ మాత్రమేనని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాల నుంచి కుటుంబ సభ్యులకుగానీ, వైద్య సిబ్బందికిగానీ వైరస్‌ సోకే ప్రమాదం లేదంటూ భారత్‌ ప్రభుత్వం కూడా అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేటప్పుడు వైద్య సిబ్బంది, మార్చురి సిబ్బంది చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్‌లు వేసుకోవాలని, మృతదేహాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు అవే జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ నేరుగా మృతదేహాలను ముట్టుకోరాదని సూచించారు. అంత్యక్రియలప్పుడు వాటిని నిర్వహించే పూజారులు, బంధు మిత్రులు మృతదేహానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని, నలుగురైదుగురికి మించి కుటుంబ సభ్యులు హాజరుకారాదని మార్గదర్శకాలు సూచించారు.

కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement