అత్యంత ఆదర్శం: రెండు తరాలుగా వారికి కులంలేదు!

Inspiration, There is Casteless family in Kerala - Sakshi

‘నమస్తే అండీ.. నా పేరు క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌’ అని ఆయన చెప్పగానే.. ప్రజలు ఆయన వైపు అయోమయంగా చూస్తారు. ఏమిటీ వింత పేరు అన్నట్టుగా ఉండే వారి అయోమయం చూపులను చూసి.. క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌ లోలోపల నవ్వుకుంటారు. కానీ, అత్యంత అరుదైన ఆయన నామం వెనుక పెద్ద కథే ఉంది. ఆయనే కాదు.. ఆయన తోబుట్టువుల పేర్లు విన్నప్పుడు కూడా జనం ఇలాగే విస్తుపోతుంటారు. ఆయన సోదరుడి పేరు క్యాస్ట్‌లెస్‌ (కులం లేదు). సోదరి పేరు షైన్‌ క్యాస్ట్‌లెస్‌.

కేరళ రాజధాని కొచ్చి నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణించి.. కొల్లాం జిల్లాలోని పునలూరుకు వెళితే.. అక్కడ ఓ ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌పై ఇలాంటి ఓ అరుదైన పేరు దర్శనమిస్తుంది. ‘కులంలేని ఇల్లు’ అని మలయాళంలో  రాసి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద ఫసులుద్దీన్‌ అలికుంజ్‌. పుట్టుకతో ముస్లిం. ఆయన సహచరి ఏజ్నెస్‌ గాబ్రియెల్‌.. క్రైస్తవ మతస్తురాలు.

ఇద్దరూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. ఫసులుద్దీన్‌ను ఏజ్నెస్‌ ప్రేమిస్తుందని తెలిసి.. కుటుంబసభ్యులు ఆమెను ‘హౌజ్‌ అరెస్టు చేశారు. దీంతో ఫసులుద్దీన్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసి మరీ ఆమెను విడిపించారు. 1973లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒకటయ్యారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకోకుండా 19 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు ఏ మతాన్ని పాటించలేదు. అయితే, తమ ఆచరణ వల్ల పిల్లలకు ఇబ్బంది ఎదురుకాకూడదని 1992లో వారు తమ కలయికను స్పెషల్‌ మ్యారేజ్ యాక్ట్‌ ప్రకారం రిజిస్టర్‌ చేయించారు. తమ ఆస్తులు వారసత్వంగా తమ పిల్లలకు దక్కడంలో ఇబ్బంది ఎదురుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తాను పదో తరగతిలో ఉన్నట్టు గుర్తుచేసుకుంటారు వారి రెండోకొడుకు క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌.

అయితే, ఆ సమయంలో ఇటు ఫసులుద్దీన్‌, అటు ఏజ్నెస్‌ కుటుంబాలు.. వారికి పుట్టబోయే పిల్లలు తమ మతాన్నే అనుసరించాలని ఒత్తిడి తెచ్చారు. వారి పిల్లలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫసులుద్దీన్‌కానీ, ఏజ్నెస్‌కానీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ‘మా తల్లిదండ్రులిద్దరూ హేతువాదులు. వారు లౌకికవాదాన్ని ఆచరించేవారు. తమ కుటుంబసభ్యుల ఒత్తిడిని లెక్కచేయక వారు జీవనాన్ని సాగించారు’ అని అంటారు క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌. సహజంగా తండ్రి మతమే పుట్టబోయే పిల్లలకు వస్తుందనే చాలామంది నమ్ముతారు. ‘కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. 1974లో మా అన్నయ్య పుట్టినప్పుడు.. అమ్మనాన్నలు అతనికి ‘క్యాస్ట్‌లెస్‌’ అని పేరు పెట్టారు’ అని నవ్వుతారు క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌. ఆ తర్వాత 1975లో తమకు పుట్టిన రెండో బాబుకు ‘క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌’ అని, 1983లో పుట్టిన చిన్నకూతురికి ‘షైన్‌ క్యాస్ట్‌లెస్‌’ అని నామకరణం చేశారు ఫసులుద్దీన్‌ దంపతులు.

కులాన్ని, మతాన్ని అనుసరించకపోవడం వల్ల తమ పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోలేదని, స్కూల్‌ రికార్డ్స్‌ల్లోగానీ, ఇతర ప్రతాల్లోగానీ కులం, మతం అని ఉన్న చోట ‘నిల్‌’ అని రాసేవారని ఫసులుద్దీన్‌ గుర్తుచేసుకుంటారు. కాన్వెంట్‌ స్కూల్‌వాళ్లు తమ ఇంటికి వచ్చి పిల్లలు పేర్లు మార్చాలని అడిగేవారని, కానీ 18 ఏళ్లు వచ్చిన తర్వాత తమ పేర్లపై పిల్లలే నిర్ణయం తీసుకుంటారని స్కూల్‌వాళ్లకు చెప్పి పంపేవాళ్లమని ఆయన చెప్తారు.

క్యాస్ట్‌లెస్‌, క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌, షైన్‌ క్యాస్ట్‌లెస్‌లకు పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎవరూ మతపరమైన ఆచారాలు పాటించలేదు. కట్నంగానీ, పూజారిగానీ లేకుండా కేవలం స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం వారు తమ వివాహాలను రిజిస్టర్‌ చేయించుకున్నారు. ‘పెళ్లికి చాలాముందే మా భాగస్వాములకు మా దృక్పథం ఏమిటో చెప్పాం. వాళ్లు అంగీకరించారు’ అంటారు క్యాస్ట్‌లెస్‌. మీ పిల్లలకు పెళ్లిళ్లు కావని, వారికి మంచి సంబంధాలు రావని ఫసులుద్దీన్‌, ఏజ్నెస్‌ను వాళ్ల కుటుంబాలు బెదిరించేవి. ఆ బెదిరింపులు ఉత్తవేనని వీరి పెళ్లిళ్లు నిరూపించాయి. సమాజం కూడా తమ కుటుంబ జీవనవిధానాన్ని అంగీకరించిందని క్యాస్ట్‌లెస్‌ అంటారు. కులం నేపథ్యం చూడకుండా ఒక్క ఓటు కూడా వేయని మన సమాజంలో పునలూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో తాను గెలుపొంది.. 2005-10 మధ్యకాలంలో వైస్‌ చైర్మన్‌గా సేవలు అందించానని ఆయన గుర్తుచేసుకుంటారు.

క్యాస్ట్‌లెస్‌ ఆయన తోబుట్టువులు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంబీఏ చేసిన క్యాస్ట్‌లెస్‌ భార్య పేరు సబిత, దుబాయ్‌లో నివాసముంటారు. వీరు తమ పిల్లలకు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్‌’, ‘ఇండియన్‌ క్యాస్ట్‌లెస్‌’ అని పేరు పెట్టారు. న్యాయవాది అయిన క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌.. పునలూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు. హిందు మహిళ అయిన రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ‘అగ్నా క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌’, ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్‌ జూనియర్‌’ అని పేరు పెట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్న షైన్‌ క్యాస్ట్‌లెస్‌ వ్యాపారవేత్త చెగువరెను పెళ్లాడారు. వీరికి అలైదా చెగువరె అనే కూతురు ఉంది.

క్యాస్ట్‌లెస్‌ అనే పేరును కొనసాగించడం అన్నది తమ వ్యక్తిగత అభీష్టమని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని ఫసులుద్దీన్‌ కుటుంబం అంటుంది. అయినా, మీరు చనిపోతే.. మీ మృతదేహాలను ఖననం చేస్తారా? లేక పూడ్చిపెడతారా? అంటూ బంధువులు కొత్త కొత్త సందేహాలతో తమ వద్దకు వస్తారని, తమ మృతదేహాలను సైంటిఫిక్‌ కమ్యూనిటీకి అందజేసి.. వారికి ఉపయోగిపడితే చాలు అని తాము భావిస్తున్నామని, ఇది అప్పుడు బతికి ఉన్న కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకుంటారని క్యాస్ట్‌లెస్ జూనియర్‌ ‘ద న్యూస్ మినిట్‌’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అన్నారు. కులానికి అతీతంగా సమాజంలో హుందాగా బతకగలమని చాటిన ‘క్యాస్ట్‌లెస్‌’ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.. కాదంటారా? ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో పంచుకోండి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top