అమ్మ ప్రోత్సాహంతోనే నేడు ఇంద్రా నూయి....

Indra Nooyi Success Story - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘విదేశానికి వెళ్లేందుకు నాకు ఉపకార వేతనం రాదని నా తల్లిదండ్రులు అప్పట్లో గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే నిన్ను మేమెందుకు ఆపుతాం! అంటూ నన్ను అనునయిస్తూ వచ్చారు. తీరా ఉపకార వేతనం మంజూరవడంతో వారు ఊగిసలాటలో పడ్డారు. పెళ్లికాని అమ్మాయిని విదేశానికి ఎలా పంపించాలి? పంపిస్తే ఒంటరిగా విదేశానికి వెళ్లిందన్న కారణంగా జీవితంలో పెళ్లి కాదుగదా! అన్నది వారి సంశయం. కుటుంబ సభ్యులందరిని పిలిచి పెద్ద మీటింగ్‌ పెట్టారు. పంపించాలా, వద్దా ! అంటూ చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. నేను మాత్రం ఏది ఏమైనా వెళతానని శపథం చేశాను. చివరకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారు. అది అంత త్వరగా సాధ్యం కాదని గ్రహించారు. చివరకు పంపించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. అలా నేను 1978లో ఐదు వందల డాలర్లను జేబులో పెట్టుకొని అమెరికా బయల్దేరాను’ అని అమెరికాలోని ప్రముఖ బహూళార్థక కంపెనీ ‘పెప్సికో’ కంపెనీకి 2006 నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఇంద్రానూయి ఈ ఏడాది జరిగిన ‘ఫోర్బ్స్‌ మహిళల సమ్మేళనం’లో తన గురించి చెప్పుకొచ్చారు.

అమెరికా దిగ్గజ కంపెనీకి పనిచేస్తున్న తొలి విదేశీ సంతతి వ్యక్తిగా, కంపెనీ తొలి మహిళా సీఈవోగా చరిత్ర సృష్టించిన ఇంద్రా నూయి, అక్టోబర్‌ 3వ తేదీ నాడు కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఎన్నో కంపెనీల్లో పనిచేసి అంచెలంచెలుగా అందరికి అందని ఎత్తుకు ఎదిగిన ఇంద్రా నూయి పెళ్లికి ముందు పేరు ఇంద్రా కృష్ణమూర్తి. తమిళ సంప్రదాయక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె చైన్నైలో అక్టోబర్‌ 28, 1955లో జన్నించారు. 

‘మా అక్కయ్య చంద్రికైనా, నేనయినా జీవితంలో రాణించడానికి కారణం మా అమ్మ. రోజు భోజనాల దగ్గర మా ఇద్దరికి ఓ పోటీ పెట్టేది. ప్రధాన మంత్రి అయితే ఎలా మాట్లాడతావు ? ముఖ్యమంత్రయితే ఎలా మాట్లాడతావు ? ఒక్క భారత దేశానికే పరిమితం కాకుండా బ్రిటీష్‌ ప్రధాని అయితే ఎలా, అమెరికా అధ్యక్షులయితే ఎలా? అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఎలా, కశ్మీర్‌ ముఖ్యమంత్రి అయితే ఎలా? అని ప్రశ్నించేది. తింటున్నంత సేపు ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉండేవాళ్లం. భోజనం ముగిశాక పరకాయ ప్రవేశంలా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నాయకుల్లా చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చేసే వాళ్లం. వాటిని శ్రద్ధగా ఆలకించే మా అమ్మ వాటికి మార్కులను కూడా కేటాయించేది’ అని ఓ సందర్భంలో పదేళ్ల క్రితం తన గురించి ఇంద్రా చెప్పుకున్నారు. 

మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదివిన ఇంద్రా కృష్ణమూర్తి  ఓ బ్యాండ్‌ తరఫున గిటార్‌ వాయించే వారు. క్రికెట్‌లో కూడా మంచి ప్రావీణ్యం చూపించారు. అయినా చదువును నిర్లక్ష్యం చేయకుండా 1974లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కలకత్తాలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టా పుచ్చుకోవాలనుకున్నారు. అప్పట్లో మహిళలు బిజినెస్‌ చదువుల పట్ల అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 

‘ఐఐఎంకు అప్పట్లో కూడా కొన్ని వేల మంది పరీక్ష రాశారు. వారిలో కొందరికే అడ్మిషన్లు లభించాయి. 150 మంది అహ్మదాబాద్‌ బ్రాంచ్‌కు వెళ్లారు. మరో వంద మంది కలకత్తాకు వెళ్లారు. వారిలో అతి తక్కువ మంది మహిళలు. వారిలో నేను ఒకరిని. అడ్డుగోడను బద్దలు కొట్టాలన్న తపన కారణంగానే నాడు బిజినెస్‌ చదవ గలిగాను’ అని గతేడాది ‘పోయెట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రా  చెప్పుకున్నారు. బిజినెస్‌లో పట్టా పుచ్చుకున్నాక ఇంద్రా మెట్టూర్‌ బియర్డ్‌సెల్‌లో, ఆ తర్వాత ముంబైలోని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లో పనిచేశారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తరఫున ‘స్టే ఫ్రీ’ శానిటరీ నాప్‌కిన్స్‌ను తీసుకరావడంలో ఆమె ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్‌షిప్‌ కూడా డిమాండ్‌ చేశారు. స్కాలర్‌షిప్‌ ఇచ్చి చేర్చుకోవడానికి యేల్‌ యూనివర్శిటీ ముందుకు వచ్చింది. 

అలా అమె 1980లో ‘యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ నుంచి పబ్లిక్, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీని అందుకున్నారు. ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే రాజ్‌ నూయిని పెళ్లి చేసుకొని ఇంద్రా నూయిగా మారిపోయారు. రాజ్‌ నూయి ప్రస్తుతం ‘ఏఎం సాఫ్ట్‌ సిస్టమ్స్‌’కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తర్వాత నూయి ‘బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌’లో చేరి ఆరేళ్లు పనిచేశారు. 1986లో ‘మోటరోలా’ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అక్కడి నుంచి 1990లో స్విస్‌ పారిశ్రామిక ఉత్పత్తుల కంపెనీ ‘ఆసియా బ్రౌన్‌ బోవరి’లో యాజమాన్య బృందంలో ఒకరిగా చేరారు. 1994లో పెప్సికో కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆమె చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా మారి కంపెనీ తరఫున చర్చలు జరిపి పలు కంపెనీలను కొనుగోలు చేయించారు. అలా ఎదుగుతూ వచ్చి 2006లో సీఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా గుడ్‌బై చెప్పాక ఆమె ఎక్కడికెళతారో, ఏ బాధ్యతలు స్వీకరిస్తారో ఇంకా వెల్లడించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top