జీశాట్‌–30 ప్రయోగం సక్సెస్‌ 

Indian Space Research Organization Successfully Launched GSat 30 - Sakshi

ఈ ఏడాది తొలి ప్రయోగం విజయవంతం

జీశాట్‌తో టీవీ, టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలకు ఊతం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఘన విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించింది. అత్యున్నత నాణ్యతతో కూడిన టీవీ, టెలీకం, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలు లక్ష్యంగా రూపొందించిన అత్యంత శక్తిమంతమైన ‘జీ శాట్‌–30’ ఉపగ్రహాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా సంబంధిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. 3,357 కిలోలు బరువు కలిగిన సమాచార ఉపగ్రహం జీశాట్‌–30ని శుక్రవారం వేకువజామున 2.35 గంటలకు ఫ్రెంచ్‌ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌5 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు.

38 నిమిషాల 25 సెకండ్ల తరువాత ఉపగ్రహం క్షేమంగా భూస్థిర బదిలీ కక్ష్యను చేరింది. ప్రయోగం విజయవంతమైందని, అందరు అందించిన సహకారానికి కృతజ్ఞతలని ఇస్రో ట్వీట్‌ చేసింది. ఏరియన్‌ స్పేస్‌ సంస్థ సీఈఓ స్టీఫెన్‌ ఇస్రాల్‌ కూడా ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తపరిచారు. ‘2020 అద్భుతంగా ప్రారంభమైంది. రెండు ఉపగ్రహాలు.. ఈయూటెల్‌సాట్‌ కనెక్ట్, జీ శాట్‌–30లను విజయవంతంగా ప్రయోగించాం’ అని స్టీఫెన్‌ ట్వీట్‌ చేశారు. ఇస్రో యూఆర్‌ రావు సాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ పీ ఉన్నికృష్ణన్‌ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. 1981లో ప్రయోగాత్మక ఆపిల్‌ నుంచి 2020లో జీశాట్‌ 30 వరకు.. 24 భారత ఉపగ్రహాలను ఏరియన్‌స్పేస్‌ తమ స్పేస్‌ రాకెట్ల ద్వారా ప్రయోగించింది.

ఎంసీఎఫ్‌ ఆధీనంలోకి.. 
ఉపగ్రహం కక్ష్యకు చేరగానే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కమాండ్‌ ఫెసిలిటీ(ఎంసీఎఫ్‌) దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఉపగ్రహ ప్రాథమిక పనితీరును పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో క్రమంగా జీశాట్‌ ఉపగ్రహాన్ని భూమధ్యరేఖకు 36 వేల కిమీల ఎత్తులో ఉన్న భూ స్థిర కక్ష్యలోకి చేరుస్తారు. ఆ తరువాత ఆ ఉపగ్రహం తన విధులను నిర్వర్తించడం ప్రారంభిస్తుంది. బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో జీశాట్‌–30 ఉపగ్ర హాన్ని రూపొందించారు.

ఈ ఉపగ్రహంలో 12సీ, 12కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లను పొందుపర్చారు. ‘కేయూ బ్యాండ్ల ద్వారా భారత్‌కు, సీ బ్యాండ్ల ద్వారా ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, గల్ఫ్‌ దేశాలకు సమాచార సేవలందుతాయి’ అని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ తెలిపారు. డీటీహెచ్, టీవీ అప్‌లింక్‌ సహా ఏటీఎం, స్టాక్‌ ఎక్సేంజ్, టెలిపోర్ట్‌ సర్వీసెస్, డిజిటల్‌ సాటిలైట్‌ న్యూస్‌ గాదరింగ్, ఈ గవర్నెన్స్, డేటా ట్రాన్స్‌ఫర్‌ తదితర వీసాట్‌ అవసరాలను జీశాట్‌–30 దాదాపు 15 ఏళ్లపాటు తీర్చగలదన్నారు. ఇన్‌శాట్‌ – 4ఏకు ఈ జీశాట్‌–30  ప్రత్యామ్నాయమని ఇస్రో పేర్కొంది. 2005లో ప్రయోగింఝట∙ఇన్‌శాట్‌– 4ఏ  కాలపరిమితి త్వరలో ముగియనుంది.

ఉపరాష్ట్రపతి, ప్రధాని అభినందనలు 
జీశాట్‌ 30 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇస్రో టీమ్‌కు అభినందనలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

ఈ అత్యాధునిక, శక్తిమంతమైన ఉపగ్రహంతో డీటీహెచ్, ఈ గవర్నెన్స్, ఏటీఎం, స్టాక్‌ ఎక్సేS్చంజ్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రశంసించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top