విజయ్‌ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు

Income Tax Raids Continue On Actor Vijay House - Sakshi

చెన్నై : కోలీవుడ్ సూపర్‌స్టార్‌ విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం ఏకకాలంలో 20 మంది ప్రముఖ ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించిన అధికారలు.. దాదాపు 20 గంటల పాటు విజయ్‌ను ప్రశ్నించారు. ‘బిగిల్‌’ చిత్రానికి తీసుకున్న రూ.50 కోట్ల పారితోషికంపై ఆరా తీశారు. మరోవైపు తమ అభిమాన హీరో ఇంటిపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న విజయ్‌ అభిమానులు భారీగా అతని ఇంటికి చేరుకున్నారు. విజయ్‌ను బీజేపీ టార్గెట్‌ చేసిందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో విజయ్‌ ఇంటికి భద్రత పెంచారు. పోలీసులు భారీగా విజయ్‌ ఇంటిని మోహరించి.. అభిమానులను అడ్డుకున్నారు. 

అసలు దాడులు ఎందుకు జరిగాయంటే..
 ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్‌. ఈ సంస్థ ఇటీవల నటుడు విజయ్‌ కథానాయకుడిగా బిగిల్‌ అనే చిత్రాన్ని నిర్మించింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఈ చిత్రం గత దీపావళికి తెరపైకి వచ్చింది. కాగా బిగిల్‌ చిత్రం తమకు నష్టం కలిగించిందని నిర్మాతలు  అంటుంటే, బయ్యర్లు మాత్రం లాభాలను అందించిందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రకరకాల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదాయశాఖ అధికారులు బిగిల్‌ చిత్ర నిర్మాత ఇంటిలో, కార్యాలయంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. వారికి పలు కీలక డాక్కుమెంట్లు లభించినట్లు సమాచారం.  

విజయ్‌కు సమన్లు 
కాగా సంస్థ నిర్మించిన బిగిల్‌ చిత్రంలో నటించిన నటుడు విజయ్‌ను విచారించాలని ఐటీ అదికారులు భావించారు. దీంతో స్థానిక సాలిగ్రామంలోని విజయ్‌ ఇంటిలో, నీలాంగరై, కానాత్తుర్‌లోని ఆయనకు చెందిన మరో రెండు ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం మాస్టర్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని  క్లైమాక్స్‌ సన్నివేశాలను బుధవారం  నెయ్‌వేలిలోని ఎన్‌ఎల్‌సీ సొరంగ పాదంలో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఐటీ అధికారులు మాస్టర్‌ చిత్ర షూటింగ్‌ ప్రాంతానికి వెళ్లి విజయ్‌కు సమన్లు అందించారు. అక్కడే ఆయన్ని విచారించారు. అనంతరం చెన్నైకి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో షూటింగ్‌ పూర్తి చేసుకుని వస్తానని చెప్పగా అందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. తన కారులో వస్తానని చెప్పినా కుదరదని తేల్చిచెప్పారు. తమ కారులోనే రమ్మని చెప్పారు. చేసేదేమి లేక ఆయన ఐటీ అధికారుల కారులోనే వారితో పాటు చెన్నైకి వచ్చారు. దీంతో మాస్టర్‌ చిత్ర షూటింగ్‌ రద్దు అయ్యింది. విజయ్‌ ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఐటీ అధికారులకు విజయ్‌ పారితోషికం వివరాలు, ఆదాయపన్ను చెల్లించని విషయాలకు చెందిన  పలు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో విజయ్‌ను చెన్నైలో మరోసారి విచారించాలని అదికారులు నిర్ణయించారు. కాగా విజయ్, ఏజీఎస్‌ సంస్థ ఇల్లు ,కార్యాలయాలతో పాటు ప్రముఖ సినీ ఫైనాన్సియర్‌ అన్బుసెలియన్‌ తదితర 20 మందికి పైగా ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం. ఇలా అనూహ్యంగా ఐటీ దాడులతో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top