మీ పెళ్లి చట్టబద్ధమేనా?

మీ పెళ్లి చట్టబద్ధమేనా?


ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ.. పెళ్లి చేసుకుంటే  కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా..? వివాహానికీ చట్టబద్ధత ఉంటుందా..?  ఇలా.. ఈ విషయంపై నిరక్షరాస్యులకే కాదు.. అక్షరాస్యులకూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధికారులు సరైన ప్రచారం చేపట్టక పోవడంతోనే వివాహ రిజిస్ట్రేషన్‌లపై ప్రజలకు అవగాహన లేదన్న విమర్శలూ ఉన్నాయి.  ఏటా వేల సంఖ్యల్లో వివాహాలు జరుగుతున్నా ఇందులో పట్టుమని పది కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదు.



దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం.. అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివాహాలకు చట్టభద్రత కొరవడుతోంది. పెళ్లికి చట్టబద్ధత కల్పించడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికీ తెలియకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఫలితంగా పలు పథకాల వర్తింపులో చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అసలు వివాహాలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి.. చేసుకుంటే ఉపయోగాలేమిటి.. తదితర వంటి అంశాలపై కథనం.



మన సంప్రదాయంలో వివాహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇటీవల వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటున్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను అధికారులూ పట్టించుకోకపోవడంతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు నమోదు కావడం లేదు.



చట్ట ప్రకారం



హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల్లో వివాహం చేసుకున్న ప్రతి జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాని దీనికి తగిన ప్రచారం కల్పించకపోవటంతో ఆ దిశగా పెళ్లిళ్లు నమోదు కావడం లేదు. వివాహాలు అధికంగా జరుగుతున్నా రిజిస్ట్రేషన్ సంఖ్య మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. ఇదే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతాయి. అండర్ స్పెషల్ మ్యారేజెస్ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమైన రోజున వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఇలా జరిగినవి కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి.  



ఒక్కటి కూడా నమోదు కాలేదు



ఏటా వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే చట్టబద్ధత పొందుతున్నాయి. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అంతంత మాత్రంగానే అమలవుతోంది. వేలల్లో వివాహాలు జరుగుతున్నా వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు పెరగటం లేదు.  వివాహాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ పదకొండేళ్ల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తగిన యంత్రాంగం లేకపోవటంతో అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు ప్రచారం చేయకపోవటం ప్రధానం కారణం.



దరఖాస్తు చేసుకుంటేనే ఫంక్షన్‌హాళ్లు



వివాహా నమోదు చట్టాన్ని అమలు చేసేందుకు ఫంక్షన్‌హాళ్లు, మ్యారేజ్‌హాల్స్, దేవాలయాలకు నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో నోటీసు లు అందజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ధ్రు వీకరణ పత్రం అందజేస్తేనే వివాహం చేసుకునే వారికి ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు దీన్ని అమలు చేయడం లేదు.  నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఇళ్ల వద్ద పెళ్లిళ్లు చేసుకునే వారిలో చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు.



 అవగాహన కల్పించాలి



 వివాహ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టబద్ధత వల కలిగే ప్రయోజనాలను వివరించటం ద్వారా వివాహాల నమోదు సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో జరిగే ప్రతి వివాహం నగరపాలక సంస్థలో తప్పని సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం ఇప్పటికి ప్రజలకు తెలియదంటే దీనిపై ప్రచారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 రెండు విధాలుగా దరఖాస్తు



పెండ్లికి నెల ముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందే సమాచారం ఇవ్వటం వల్ల తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వధువు, వరుడి పాస్‌పోర్టు సైజు ఫొటోలు, లగ్న పత్రికను విధిగా ధరఖాస్తు ఫారంతో జతపర్చాలి.



ముందుగా దరఖాస్తు చేసుకోనివారు వివాహం చేసుకున్న నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పెండ్లి ఫొటోలు, వధువు, వరుడి రెండు పాస్ ఫొటోలు, లగ్న పత్రికను దరఖాస్తుతో జతపర్చాలి. నగరపాలక సంస్థ సిబ్బంది విచారణ చేపట్టి.. క్లియరెన్స్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.



 ప్రయోజనాలు

 *వివాహానికి చట్టబద్ధత ఉంటుంది.

 *కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాల వర్తింపునకు ఇది చాలా అవసరం.

 *వరకట్న వేధింపుల సందర్భాలలో నేరాలు రుజువు కావడానికి ముఖ్య ఆధారం.

 *హింసకు గురైన లేదా గురవుతున్న స్త్రీ, పురుషులిద్దరికి ఇది సౌకర్యమే.

 *బాల్య వివాహాలు నివారించవచ్చు.

 *విదేశాలకు వెళ్లే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top