
సాక్షి, న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాదీ హజ్ యాత్ర కోటా పెంచుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. గత ఏడాది కంటే 5వేలు ఎక్కువగా ఈ ఏడాది 1,75,025 మంది మన యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కలిగిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు.
మూడేళ్ల క్రితం హజ్ కోటా 1,36,020గా ఉందన్నారు. ఈసారి హజ్ యాత్రకు 3,55,000 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. 45 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలు హజ్ వెళ్లేందుకు తొలిసారిగా అవకాశం కల్పించామని, దరఖాస్తు చేసుకున్న 1,300 మందికి లాటరీ విధానం నుంచి మినహాయించి నేరుగా అవకాశం ఇచ్చామన్నారు. కోటా పెంచినందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.