'మహా'రాష్ట్రపతి పాలన 

Governor Koshyari report that establishing a stable government is impossible now - Sakshi

ఇప్పట్లో స్థిర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమంటూ గవర్నర్‌ కోష్యారీ నివేదిక 

దాంతో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్‌ సిఫారసు.. రాష్ట్రపతి ఆమోదం 

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు

ముందు ఉమ్మడి అజెండాపై స్పష్టతకు రావాలని నిర్ణయం 

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం మరిన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. కేబినెట్‌ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఎన్సీపీల చర్చలు మంగళవారం కూడా కొనసాగాయి. కాంగ్రెస్‌ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తదితరులతో ముంబైలో చర్చలు జరిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందుగా.. మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌–సీఎంపీ)పై అవగాహన కుదరాలని, పొత్తుపై విధివిధానాలను నిర్ణయించుకోవాలని, అందుకు మరింత సమయం అవసరమని ఎన్సీపీ– కాంగ్రెస్‌ నిర్ణయించాయి. 

ముఖ్యంగా సైద్ధాంతిక విబేధాలున్న శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్పష్టమైన ప్రణాళిక అవసరమని ఆ రెండు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాగా, సాయంత్రం సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు సాధించేందుకు గవర్నర్‌ తమకు 24 గంటల సమయం మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతి పాలన విధించడంపై స్పందిస్తూ.. మేం మూడురోజుల సమయం అడిగితే, ఆరునెలల సమయమిచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు తమకు గడువును పొడిగించకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు చేయడాన్ని సవాలు చేస్తూ శివసేన  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆ పార్టీ నేత నారాయణ రాణె వ్యాఖ్యానించారు.  

మహారాష్ట్రలో ఆర్టికల్‌ 356 
ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచిపోయినా, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు నెలకొనలేదని, ప్రభుత్వ ఏర్పాటుకు తాను చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ మంగళవారం కేంద్రానికి నివేదిక అందించారు. బీజేపీ, శివసేనలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలమవడంతో మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ఆహా్వనించామని, అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు ఎన్సీపీ 3 రోజుల గడువు కోరిందని కేంద్రానికిచ్చిన నివేదికలో గవర్నర్‌ వివరించారు. ‘రాష్ట్రపతి పాలన సాధారణంగా ఆరునెలల పాటు ఉంటుంది, కానీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటే.. ఆరు నెలల ముందే రాష్ట్రపతి పాలనను ఎత్తేసేందుకు అవకాశముంది’ అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్‌ తప్పుబట్టింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ చర్చలు 
ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో మంగళవారం ఉదయం కూడా ముఖ్య నేతల చర్చలు కొనసాగాయి. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌తో సోనియా మరోసారి ఫోన్‌లో సంభాశించారు. అనంతరం, ముంబై వెళ్లి పవార్‌తో చర్చలు జరపాల్సిందిగా సీనియర్‌ నేతలు ఖర్గే, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌లను ఆదేశించారు. చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శివసేనకు మద్దతునిచ్చే విషయంలో మరింత స్పష్టత అవసరమని, చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు  అహ్మద్‌పటేల్‌ తదితర నేతలు తెలిపారు.  

మాకూ స్పష్టత కావాలి 
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఒక ప్రణాళిక రూపొందిస్తామని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్, ఎన్సీపీల మాదిరిగానే శివసేనకు కూడా ప్రభుత్వ ప్రాథమ్యాలకు సంబంధించిన కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌పై స్పష్టత అవసరమన్నారు. సోమవారమే మద్దతు కోరుతూ ఎన్సీపీ, కాంగ్రెస్‌లను తొలిసారి సంప్రదించామని, బీజేపీ పాటించే హిందూత్వ.. నకిలీ హిందూత్వ అని ఉద్ధవ్‌ విమర్శించారు. హిందూత్వ అంటే కేవలం రామ మందిర నిర్మాణం కాదని, హిందూత్వ అంటే రాముని మార్గంలో సత్యసంధతతో వ్యవహరించడమని వ్యాఖ్యానించారు. 

సుప్రీంకోర్టుకు శివసేన 
ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజుల గడువు కావాలని కోరినా గవర్నర్‌ ఇవ్వలేదని పేర్కొంటూ, గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా మంగళవారమే విచారించాలని కోరినా.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అంగీకరించలేదు. ఇప్పటికిప్పుడు బెంచ్‌ను ఏర్పాటుచేయలేమని రిజిస్ట్రీ స్పష్టం చేసింది. దాంతో ఆ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ కూడా ఒక పిటిషన్‌ వేయాలనుకుంటున్నామని, అయితే దానిపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని సేన తరఫు న్యాయవాది ఫెర్నాండెజ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top